ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల ఫలితంగా రూపుదాల్చనున్న ప్రాజెక్టు
గిరిజనుల జీవనశైలి మార్చేందుకు, వారికి సుస్థిరమైన ఆర్థిక ప్రగతి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో అరుదైన అటవీ ఉత్పత్తుల గుర్తింపుతోపాటు కార్పొరేట్ స్థాయి మార్కెటింగ్ ద్వారా అడవిబిడ్డల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు పట్టిష్ట ప్రణాళిక రూపుదిద్దుకొంటోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి.) ఆధ్వర్యంలోని భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థలు మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ కుదుర్చుకున్నాయి. అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన త్రిసభ్య ఒప్పంద పత్రాలపై ఈ మూడు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు. అటవీ ఉత్పత్తుల నిర్వహణ, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకు వెళ్లాల్సిన మార్పులు, గిరిజనుల జీవనశైలి మెరుగుపర్చడం మీద ఈ మూడు సంస్థలు సంయుక్తంగా దృష్టి పెట్టనున్నాయి.
ఈ ఎం.ఓ.యూ. ప్రకారం – అడవుల్లో దొరికే సహజ సిద్ధమైన సీజనల్ ఉత్పత్తుల గుర్తింపు, సేకరణ, మార్కెటింగ్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తారు. పర్యావరణహితంగా అడవుల సాధారణ స్థితికి ఏ మాత్రం భంగం కలిగించకుండా డిజిటల్, జియోస్పాషియల్ సాంకేతికత ఆధారంగా అరుదుగా దొరికే ఉత్పత్తులను గుర్తిస్తారు. రాష్ట్రంలోని అడవుల్లో దొరికే అద్భుతమైన సంపదను దీనివల్ల గుర్తించడం సులభతరం అవుతుంది. ప్రాజెక్టులో ఆయా ప్రాంతాల్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా గిరిజన మహిళలను దీనిలో భాగం చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తారు. కలప ఉత్పత్తులను మినహాయించి ఇతర నాణ్యమైన, అరుదైన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి మార్కెటింగ్, బ్రాండింగ్ చేయడం మీద దృష్టిపెడతారు.
రాష్ట్ర అటవీ శాఖ పి.సి.సి.ఎఫ్., హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్. శ్రీ చిరంజీవ్ చౌదరి మాట్లాడుతూ… ‘‘అటవీ ఆర్థిక ప్రగతికి ఈ ఒప్పందం గేమ్ ఛేంజర్ అవుతుంది. అటవీ ఉత్పత్తుల ద్వారా సంపద సృష్టి భారీగా పెరుగుతుంది. ఇది గిరిపుత్రుల ప్రగతికి దారి చూపుతుంది. 40 శాతం మంది గిరిపుత్రులు అటవీ ఉత్పత్పుల మీద ఆధారపడి నేటికీ జీవనం సాగిస్తున్నారు. వారికి ఈ ఒప్పందం ప్రకారం మేలు జరుగుతుంది. వారి జీవన గతి మెరుగుపడుతుంద”న్నారు. ఈ సందర్భంగా భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఈడీ శ్రీ అశ్వనీ ఛాత్రే మాట్లాడుతూ ‘‘అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులకే దక్కేలా చూడటమే ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ ఉత్పత్తుల గుర్తింపు, మార్కెటింగ్ సప్లై ఛైన్ ఏర్పాటు, కొత్త అవకాశాలను సృష్టించడం అనేది ప్రధానం. దీనివల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త మార్పులు వస్తాయ”న్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఎం.డి. శ్రీ రాజేంద్ర ప్రసాద్ కజూరియా పాల్గొన్నారు.
Post Views: 22