30ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షాలు, వరదలు
– తమిళనాడులో కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
– తమిళనాడులో భయానక వరదలు
తమిళనాడు విల్లుపురం జిల్లాను ఫెయింజల్ తుపాను వణికించింది. ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడం వల్ల కొన్ని జిల్లాల్లో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు వరద ప్రవాహం ధాటికి వాగులుగా మారాయి. ఫలితంగా విల్లుపురం మీదుగా ప్రయాణించే అన్నీ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సర్వీసులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.వరద ఉద్ధృతికి పలు వంతెనలు దెబ్బతిన్నాయి. తిరువణ్ణామలై జిల్లాలోని అరనిలో రహదారులు ధ్వంసమయ్యాయి. ఫెయింజల్ బీభత్సం ధాటికి కృష్ణగిరి జిల్లాలో 3 దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని భారీ వర్షాలు కురిశాయి. భయానక వరదలు సంభవించాయి. వ్యాన్లు, బస్సులు, కార్లు వరదలో కొట్టుకుపోయాయి. ఉత్నంగరై నుంచి కృష్ణగిరికి, తిరువణ్ణామలైకు ప్రయాణించే రహదారిపై భారీగా వరదనీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.