Mahaa Daily Exclusive

  సింగరేణి కార్మికులకు 34 శాతం దసరా బోనస్‌..

Share

  • సింగరేణి కార్మికులకు 34 శాతం దసరా బోనస్‌
  • ఒక్కో ఉద్యోగికి రూ.1.54 లక్షలు
  • కాంట్రాక్టు కార్మికుడికి రూ. 5,500 ల బోనస్ చెల్లింపు
  • వివరాలను వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి
  • 15 రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడి

 

హైదరాబాద్, మహా : దసరా పండుగ వేళ సింగరేణి బొగ్గు గని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంస్థ సాధించిన లాభాల్లో 34 శాతం వాటాను శాశ్వత కార్మికులకు బోనస్‌గా చెల్లించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నిర్ణయంతో అర్హులైన ఒక్కో పర్మినెంట్‌ కార్మికుడికి సుమారు రూ.1.54 లక్షల వరకు దసరా బోనస్‌ కింద అందనుంది. మరోవైపు.. కాంట్రాక్టు కార్మికులకు కూడా ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. దసరా పండుగకు ముందే బోనస్‌ అందనుండటంతో కార్మికులు, వారి కుటుంబాల్లో ఆనందోత్సవాలు నెలకొననున్నాయి.

 

సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ రూ.1,754 కోట్ల మేర లాభాలు ఆర్జించిందని.. అందులో 34 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. బొగ్గు గనుల్లో కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ సింగరేణి సంస్థ కార్యకలాపాలకు తోడ్పడుతున్న కార్మికులకు పండుగ సమయంలో ఈ బోనస్‌ ఆర్థికంగా ఉపయోగపడనుంది. బోనస్‌ మొత్తాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోనుంది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకూ రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. సంస్థలో శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా కీలకమైన సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కూడా పండుగ ఖర్చుల విషయంలో కొంత ఊరట లభించనుంది.

 

బోనస్‌తో పాటు సింగరేణిలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యల పరిష్కారంపైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న సుమారు 300 మంది డిపెండెంట్‌ ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేసి.. అర్హులకు నియామక పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే మారుపేర్ల సమస్యకు పరిష్కారం చూపే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ సమస్యపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్మికులకు సంబంధించిన వైద్య పరీక్షల ప్రక్రియలోనూ సౌకర్యాలు పెంచే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించి.. సంబంధిత ఏరియా ఆసుపత్రుల్లోనే సౌకర్యాలు కల్పించే అంశం ప్రస్తావనకు వచ్చింది. సింగరేణి కార్మికుల నివాస సౌకర్యాలను మెరుగుపరచడం, పాత క్వార్టర్ల స్థానంలో మెరుగైన వసతులతో కూడిన ఇళ్ల నిర్మాణం, మైనింగ్‌ కార్యకలాపాలు లేని ప్రాంతాల్లో హౌసింగ్‌ కాలనీల ఏర్పాటు వంటి అంశాలపైనా ప్రకటనలు చేశారు. కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకునే చర్యలు అమలులోకి వస్తే దీర్ఘకాలిక ప్రయోజనం కలగనుంది.