Mahaa Daily Exclusive

  సౌర కుటుంబ రహస్యాల ఛేదనకు యూఏఈ సన్నద్ధం…

Share

సౌర కుటుంబ రహస్యాల ఛేదనకు యూఏఈ సన్నద్ధం.

* జస్టిటియా గ్రహశకలంపై దిగనున్న పరిశోధక పరికరం.

* ఐదు వందల కోట్ల కిలోమీటర్ల అంతరిక్ష ప్రయాణం.

* 2028లో ప్రయోగానికి ఎమిరేట్స్‌ గ్రహశకల యాత్ర

అబుదాబి, మహా.

 

సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలను ఛేదించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. అంగారకుడు, గురు గ్రహాల మధ్య ఉన్న ప్రధాన గ్రహశకలాల వలయంలోని 269 జస్టిటియాపై పరిశోధనలు నిర్వహించేందుకు ప్రత్యేక పరిశోధక పరికరాన్ని అబుదాబిలోని సాంకేతిక ఆవిష్కరణల సంస్థ అభివృద్ధి చేసింది. ఈ పరికరాన్ని రూపకల్పన చేయడంతోపాటు నిర్మించి, పరీక్షలు కూడా నిర్వహించినట్లు సంస్థ ప్రకటించింది. 2028లో ప్రయోగించనున్న ఎంబీఆర్‌ ఎక్స్‌ప్లోరర్‌ వ్యోమనౌకలో దీనిని అంతరిక్షంలోకి పంపనున్నారు. సుమారు 500 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం 2036 ప్రారంభంలో జస్టిటియా ఉపరితలంపై దింపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే గ్రహశకలంపై నేరుగా దిగిన పరిశోధక పరికరాల్లో ఇది ఏడవదిగా నిలుస్తుంది.

జస్టిటియా ప్రధాన గ్రహశకలాల వలయంలో అత్యంత ఎరుపు రంగులో కనిపించే ఖగోళ వస్తువుల్లో ఒకటి. దీని ఉపరితల లక్షణాలు, కాంతి ప్రతిబింబించే విధానం నెప్ట్యూన్‌ గ్రహానికి అవతల ఉన్న కూయిపర్‌ బెల్ట్‌లోని కొన్ని ఖగోళ వస్తువులను పోలి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పోలికల ఆధారంగా జస్టిటియా తొలుత సౌర కుటుంబం బయటి ప్రాంతంలో ఏర్పడి, అనంతరం గ్రహాల ఆవిర్భావ దశలో ప్రస్తుత కక్ష్యలోకి చేరి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గ్రహాలు ఏర్పడిన తొలి దశల్లో నీరు, అస్థిర పదార్థాలు, సేంద్రీయ సమ్మేళనాలు సౌర కుటుంబంలోని వివిధ ప్రాంతాలకు ఎలా చేరాయనే ప్రశ్నకు జస్టిటియా పరిశోధన సమాధానాలు అందించే అవకాశం ఉంది. ఈ గ్రహశకలం ఉపరితలంపై సంక్లిష్టమైన సేంద్రీయ పదార్థాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యకాంతి, అంతరిక్ష వికిరణాల ప్రభావంతో మంచు పదార్థాల్లో మార్పులు సంభవించి ఇటువంటి సమ్మేళనాలు ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిశోధక పరికరం ఉపరితలానికి చేరువగా చిత్రాలను నమోదు చేయడంతోపాటు అక్కడి పదార్థాల కూర్పు, భౌతిక లక్షణాలపై సమాచారం సేకరించనుంది. ఈ వివరాలు గ్రహశకలాల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

 

ఈ పరిశోధక పరికరానికి ఉన్న ప్రత్యేకత దాని స్వయంప్రతిపత్తి. అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత భూమి నుంచి లేదా ప్రధాన వ్యోమనౌక నుంచి నిరంతర ఆదేశాలు అందకపోయినా, ఇందులోని కంప్యూటింగ్‌ వ్యవస్థ స్వయంగా నిర్ణయాలు తీసుకునేలా రూపొందించారు. ఎప్పుడు చిత్రాలు తీయాలి, ఎన్ని చిత్రాలను నమోదు చేయాలి, వాటిలో ఏవి భద్రపరచాలి అనే అంశాలను అంతర్గత సాఫ్ట్‌వేర్‌ నిర్ణయిస్తుంది. విద్యుత్‌ నిర్వహణ, చిత్రాల ఎంపిక, సమాచార ప్రాసెసింగ్‌ వంటి విధులను ప్రత్యేక డిజిటల్‌ వ్యవస్థ నిర్వహిస్తుంది.

పరిశోధక పరికరంలో రెండు కెమెరాలను అమర్చారు. వీటిలో ఒకటి విస్తృత ప్రాంతాన్ని చిత్రీకరించేందుకు, మరొకటి మరింత స్పష్టమైన సమీప దృశ్యాలను నమోదు చేసేందుకు ఉపయోగపడుతుంది. ప్రధాన వ్యోమనౌక ప్రయాణించే సమయంలోనూ పరికరం చిత్రాలను సేకరిస్తుంది. సుమారు ఆరు నెలల వ్యవధిలో సమాచారాన్ని భూమికి పంపించే విధంగా ప్రణాళిక రూపొందించారు. జస్టిటియా వద్దకు చేరుకున్న తర్వాత ప్రధాన వ్యోమనౌక కక్ష్యలో ఉండగా పరిశోధక పరికరం విడిపోయి ఉపరితలం వైపు దిగుతుంది. ఆ సమయంలో సేకరించే చిత్రాలు, సమాచారంతో ఉపరితల పొరల లక్షణాలను మరింత దగ్గరగా అధ్యయనం చేయవచ్చు.

ఎమిరేట్స్‌ గ్రహశకలాల అన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఎంబీఆర్‌ ఎక్స్‌ప్లోరర్‌ సుమారు ఎనిమిదేళ్లపాటు అంతరిక్షంలో ప్రయాణించనుంది. ఈ ప్రయాణంలో శుక్రుడు, భూమి, అంగారక గ్రహాల గురుత్వాకర్షణను ఉపయోగించుకుని దిశ, వేగంలో అవసరమైన మార్పులు చేసుకునే ప్రణాళిక ఉంది. ప్రధాన గ్రహశకలాల వలయంలోని ఆరు గ్రహశకలాలను సమీపంగా పరిశీలించిన అనంతరం ఏడవ లక్ష్యమైన జస్టిటియా వద్దకు చేరుకోనుంది. మొత్తం ప్రయాణ దూరం సుమారు 500 కోట్ల కిలోమీటర్లు. వ్యోమనౌకను 2028 మార్చిలో జపాన్‌ నుంచి ప్రయోగించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సాంకేతిక ఆవిష్కరణల సంస్థ వెల్లడించింది.