Mahaa Daily Exclusive

  యువజన సంక్షోభం..

Share

ప్రపంచ వ్యాప్తంగా జనాభా సంక్షోభం ఇపుడు ప్రధాన సమస్యగా మారుతోంది. ఆయా దేశాలను ఆందోళనలకు గురిచేస్తోంది. ఇంతకాలం చైనా ఈ సమస్యతో సతమతమవుతుండగా, తర్వాత గ్రీస్, టర్కీ ఇలా అనేక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇపుడు భారత్ యువ దేశమైనా.. నమోదవుతున్న గణాంకాలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు.. అప్రమత్తం కావాల్సిన హెచ్చరికగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో జనాభా నియంత్రణ పద్దతులు పక్కనపెట్టి యువశక్తిని దేశనిర్మాణం కోసం పెంపొందించుకోవాల్సిన అనివార్యతను చాటుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం మనది.. ఒళ్లొంచి పని చేసే యువ జనాభా ఎక్కువగా ఉండటమే భారత్‌ బలం. అయితే, ఈ బలం భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇప్పటి ‘యువ భారతం’ మూడు దశాబ్దాల తరువాత ‘వృద్ధ భారతం’గా మారబోతున్నది. జనాభా రేటు తగ్గిపోయి, వృద్ధుల జనాభా పెరగడం వల్ల ఇప్పుడు జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఆ దేశాల అభివృద్ధికి ఇది అడ్డంకిగా మారుతున్నది. ఇదే పరిస్థితి 30 ఏండ్ల తర్వాత మన దేశానికీ ఎదురుకాబోతున్నది. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండనుంది. ఇటీవల దేశ సగటు 2.1గా నమోదవుతుండగా, ప్రతీ ఒక్కరు కనీసం ముగ్గురు పిల్లలను కంటేనే భవిష్యత్తులో యువత, ‘వృద్ధ మధ్య అసమానతలు ఉండవు. లేకుంటే ‘వృద్ధ జనాభాతో దేశం నిండిపోయే ప్రమాదముంది. పాఠశాలలు ‘వృద్ధాశ్రమాలుగా మారే సూచనలు ఉన్నాయి.

 

6.18 నుండి 2కి

ఒక మహిళ 15 ఏండ్ల నుంచి 49 ఏండ్ల మధ్య వయసులో జన్మనిచ్చే పిల్లల సంఖ్య సగటును సంతానోత్పత్తి రేటుగా లెక్కిస్తారు. 1950లో దేశంలో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉండేది. అధిక జనాభా కారణంగా ఆహార కొరత వంటి సమస్యలు తలెత్తడంతో 1951 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇద్దరిని మించి కనవద్దని అవగాహన కల్పించారు. దీంతో క్రమంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తగ్గుదల మరీ ఎక్కువ కావడమే ఇప్పుడు సమస్యగా మారింది. జనాభా తగ్గొద్దంటే సంతానోత్పత్తి 2.1గా ఉండాలి. మన దేశంలో సంతానోత్పత్తి రేటు వేగంగా ఈ రీప్లేస్‌మెంట్‌ స్థాయికి దిగువకు పడిపోతున్నది. దేశంలోని 36 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31లో సంతాన రేటు 2.1కు, అంతకు దిగువకు పడిపోయింది. బీహార్‌, యూపీ, జార్ఖండ్‌, మేఘాలయ, మణిపూర్‌ మాత్రమే ఎగువన ఉన్నాయి. 2019-21కి దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0తో రీప్లేస్‌మెంట్‌ స్థాయికి దిగువకు తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. భారత్‌లో సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 1.29కు పడిపోతుందని ఇటీవల లాన్సెట్‌ జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. అంటే, మరో మూడు దశాబ్దాల్లో దేశంలో వృద్ధుల జనాభా భారీగా పెరగడంతో పాటు మొత్తం జనాభా సంఖ్య తగ్గిపోనున్నది. ఇదే జరిగితే దేశానికి బలంగా ఉన్న శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. ప్రస్తుతం చైనా అనేక చర్యలు తీసుకున్నా యువత ఒంటరిజీవితానికే మొగ్గు చూపుతున్నారు. పెళ్ళి, పిల్లలపై ఇష్టపడడం లేదు. వివాహాలను ప్రోత్సహించి, విడాకుల నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు అనేక చర్యలు తీసుకున్నా.. అక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో అత్యధిక జనాభా కలిగిన భారత్ ప్రమాదాన్ని గ్రహించి అప్రమత్తం కావాల్సి ఉంది.