- నమోదుకు మరో అవకాశం
- గడువులోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- జలమండలి వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయం
హైదరాబాద్, మహా : హైదరాబాద్ మహానగర జలమండలి పరిధిలోని అన్ని ప్రైవేట్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీలు) యాజమాన్యాలు అక్టోబర్ 25వ తేదీలోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జలమండలి పిలుపు. నమోదుకు కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, అక్టోబర్ 25వ తేదీని తుది గడువుగా పరిగణించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.జలమండలి పరిధిలో సుమారు 600 ప్రైవేట్ ఎస్టీపీలు ఉన్నట్లు అంచనా కాగా, ఇప్పటివరకు కేవలం 61 ఎస్టీపీలు మాత్రమే జలమండలి వద్ద నమోదు చేసుకున్నాయని తెలిపారు. మిగిలిన ఎస్టీపీల యాజమాన్యాలు గడువు ముగియకముందే నమోదు చేసుకోవాలని సూచించారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఏర్పాటు చేసిన అన్ని ఎస్టీపీలకు ఈ నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. ఎస్టీపీల సామర్థ్యం, రోజువారీ మురుగునీటి శుద్ధి పరిమాణం, శుద్ధి చేసిన నీటి వినియోగం, అందుబాటులో ఉన్న మిగులు నీటి వివరాలను సమీకరించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు.
రానున్న వేసవిలో తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఉద్యానవనాల నిర్వహణ తదితర తాగునీరు అవసరం లేని కార్యకలాపాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రైవేట్ ఎస్టీపీల్లో శుద్ధి చేసిన మిగులు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి:
ప్రైవేట్ ఎస్టీపీల యాజమాన్యాల సౌకర్యార్థం జలమండలి వెబ్సైట్ యాజమాన్యాలు వెబ్సైట్ను సందర్శించి ప్రైవేట్ ఎస్టీపీల రిజిస్ట్రేషన్ లింకుపై క్లిక్ చేయాలి. అనంతరం సంబంధిత సంస్థ పేరు, చిరునామా, సంప్రదింపు వివరాలు, ఎస్టీపీ సామర్థ్యం, రోజువారీ శుద్ధి చేస్తున్న మురుగునీటి పరిమాణం, శుద్ధి చేసిన నీటి వినియోగం, మిగులు నీటి లభ్యత తదితర వివరాలను ఆన్లైన్ ఫారంలో కోరిన మేరకు నమోదు చేయాలి. వివరాలను సరిచూసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
అక్టోబర్ 25వ తేదీతో నమోదు గడువు ముగియనున్నందున, ఇప్పటివరకు నమోదు చేసుకోని ప్రైవేట్ ఎస్టీపీల యాజమాన్యాలు చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.








