Mahaa Daily Exclusive

  ఇన్ స్టాగ్రామ్ లోకి సోనియాగాంధీ…

Share

  • ఇన్ స్టాగ్రామ్ లోకి సోనియాగాంధీ
  • తొలి పోస్ట్‌తోనే సోషల్ మీడియాలో వైరల్
  • రాబోయే జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’
  • తొలి లుక్‌ను అభిమానులతో పంచుకున్న నేత

 

న్యూఢిల్లీ, మహా : సోనియా గాంధీ గురువారం అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన రాబోయే జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ తొలి లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 10న విడుదల కానున్న ఈ పుస్తక పరిచయ వేడుకలో భాగంగా ఆమె ఈ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తన తొలి పోస్ట్‌లో 79 ఏళ్ల సోనియా గాంధీ ఈ ప్రత్యేక క్షణాన్ని అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. “హలో అందరికీ.. ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదే నా జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ తొలి లుక్” అని ఆమె క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. “ఇది ప్రేమ, బాధ్యత, నష్టం , మనకంటూ ఒక చోటును వెతుక్కునే ప్రయాణానికి సంబంధించిన కథ. దీనిని మీతో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

 

ఈ పుస్తకం ద్వారా సోనియా గాంధీ తన బాల్య జీవితం నుండి ఇప్పటివరకు జరిగిన పలు ముఖ్యమైన ఘట్టాలను పంచుకున్నారు. యుద్ధానంతర ఇటలీలో గడిపిన ఆమె బాల్య రోజులు. కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న సమయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ఏర్పడిన పరిచయం, ఆపై ప్రేమ ప్రయాణం. తన అత్తగారైన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, అలాగే భర్త రాజీవ్ గాంధీ హత్యల వంటి తీవ్ర వ్యక్తిగత విషాదాలు అవి ఆమె జీవితాన్ని, భారతదేశంతో ఆమెకున్న అనుబంధాన్ని ఎలా ప్రభావితం చేశాయనే విషయాలు ఇందులో ఉన్నాయి.

 

ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ.. 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీని కలుసుకున్నప్పుడు ఆమె వయస్సు 19 సంవత్సరాలు. ఆ తర్వాత 1968 ఫిబ్రవరి 25న వీరి వివాహం జరిగింది. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా సేవలందించిన నేతగా నిలిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబంలో సభ్యురాలిగా ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, భారతదేశంలో ఆమె జీవిత ప్రయాణాన్ని ఈ పుస్తకం ప్రతిబింబించనుంది. మొత్తానికి, తన జీవిత విశేషాలను పుస్తక రూపంలో తెస్తున్న సోనియా గాంధీ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.