Mahaa Daily Exclusive

  గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు నిరాశ.

Share

  •  ‘జీవన నాణ్యత’లో భారీగా పడిపోయిన ర్యాంకింగ్స్!

హైదరాబాద్, మహా.

అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీగా శరవేగంగా దూసుకుపోతున్న భాగ్యనగరం హైదరాబాద్ జీవన నాణ్యత విషయంలో తీవ్ర వెనుకకంజలో ఉన్నట్లు తాజాగా వెల్లడైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రఖ్యాత ‘ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026’ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1,000 ప్రధాన నగరాల జాబితాను విడుదల చేయగా, అందులో హైదరాబాద్ 421వ స్థానానికి పడిపోయింది. దేశంలోని ఇతర మహానగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైలతో పోలిస్తే మన నగర ర్యాంకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఆర్థిక పురోగతి, హ్యూమన్ క్యాపిటల్ విభాగాలలో నగరం మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, ప్రాథమిక జీవన ప్రమాణాలు మరియు పర్యావరణ పరిరక్షణలో మాత్రం అత్యంత పేలవమైన ఫలితాలను నమోదు చేసింది.

ఈ నివేదిక ప్రకారం ఆర్థిక దృఢత్వంలో 248వ స్థానాన్ని, హ్యూమన్ క్యాపిటల్ విభాగంలో 241వ స్థానాన్ని దక్కించుకుని హైదరాబాద్ తన సత్తా చాటింది. బలమైన ఉపాధి అవకాశాలు, ఐటీ కాస్మోపాలిటన్ సంస్కృతి, పేరుమోసిన విశ్వవిద్యాలయాలు, నైపుణ్యమున్న యువత నగరానికి ప్రధాన ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే ఈ ఆర్థిక ప్రగతి స్థానిక నివాసితుల ప్రాథమిక జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఆదాయ అసమానతలు, విపరీతంగా పెరిగిపోయిన ఇళ్ల అద్దెలు, వైద్య సదుపాయాల భారం, పెరుగుతున్న నేరాల రేటు, వినోద రంగాలు వంటి వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని లెక్కించిన ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ విభాగంలో హైదరాబాద్ ఏకంగా 818వ స్థానానికి దిగజారిపోవడం గమనార్హం.

మరోవైపు పర్యావరణ రక్షణ విభాగంలోనూ నగర పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ జాబితాలో హైదరాబాద్ 657వ స్థానంలో నిలిచింది. ముంబై (782), ఢిల్లీ (915) నగరాలతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, బెంగళూరు (528) కంటే మాత్రం వెనుకబడిపోయింది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న గాలి కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు, వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పులు, అస్తవ్యస్తంగా మారుతున్న ట్రాఫిక్ వ్యవస్థ నగర వాసులకు శాపంగా మారుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

కేవలం ఆర్థికంగా అగ్రగామిగా ఎదగడమే కాకుండా, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ప్లానర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, రోడ్ల నిర్మాణాన్ని సీరియస్‌గా తీసుకోవడం, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసి సొంత వాహనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చి ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకోవచ్చని వారు గట్టిగా సూచిస్తున్నారు.