Mahaa Daily Exclusive

  భారత అంతర్గత భద్రతను కుదిపేస్తున్న విదేశీ కుట్రలు….

Share

భారత అంతర్గత భద్రతను కుదిపేస్తున్న విదేశీ కుట్రలు.
* ‘రెడ్-గ్రీన్ నెట్‌వర్క్’, యూఎన్ ద్వంద్వ వైఖరి వెనుక అసలు డీప్ స్టేట్ పన్నాగాలివే!
* చైనా నిధులతో నడుస్తున్న ‘కెయోస్ ఇంక్’ మైండ్ గేమ్.
* దేశంలో కృత్రిమ అస్థిరత సృష్టించేందుకు జరుగుతున్న కుటిల యత్నం.

అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఆర్థికంగా, రక్షణ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, తిరుగులేని ప్రపంచ శక్తిగా శరవేగంగా ఎదుగుతున్న చారిత్రక తరుణంలో.. దేశ అంతర్గత రాజకీయాలను, శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు అంతర్జాతీయ శక్తులు తెరవెనుక అత్యంత ప్రమాదకరమైన కుట్రలకు పాల్పడుతున్నాయి. రాజకీయ పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా జాతీయ భద్రత కోణంలో లోతుగా పరిశీలిస్తే.. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ఫాక్స్ న్యూస్’ తాజాగా బట్టబయలు చేసిన “కెయోస్ ఇంక్” నెట్‌వర్క్ వ్యవహారాలు, అలాగే అంతర్జాతీయ సంస్థల పూటకో మాటగా ఉండే ద్వంద్వ వైఖరీలు భారత్ భద్రతా ముఖచిత్రాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రజాస్వామ్య దేశాలను టార్గెట్ చేసుకుని అశాంతిని రగిలించేందుకు పశ్చిమ దేశాల నుంచి చైనా వరకు విస్తరించిన ఈ మాయాజాలాన్ని సమూలంగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలను అల్లకల్లోలం చేయడానికి తొమ్మిది దేశాలకు విస్తరించి పనిచేస్తున్న ఒక భారీ నిరసనల పర్యావరణ వ్యవస్థను ‘కెయోస్ ఇంక్’ పేరుతో ఫాక్స్ న్యూస్ నివేదిక వెలుగులోకి తెచ్చింది. దీని వెనుక ఏకంగా 101 అంతర్జాతీయ సంస్థలు చక్రం తిప్పుతుండటం గమనార్హం. ఇందులో అత్యంత విస్మయకరమైన అంశం ఏమిటంటే, ఈ నెట్‌వర్క్ పూర్తిగా రెండు బలమైన శక్తుల కలయికతో నడుస్తోంది. ఒకవైపు కమ్యూనిస్టులు, సోషలిస్టులు, హింసాత్మక మార్గాలకు సైతం వెనుకాడని ‘యాంటీఫా’ లాంటి వామపక్ష అతివాద సంస్థలు (రెడ్) ఉండగా, మరోవైపు ఇస్లామిస్ట్ అనుకూల శక్తులు (గ్రీన్) జతకట్టాయి. ఈ రెండూ కలిసి ‘రెడ్-గ్రీన్ కూటమి’గా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా అశాంతిని, నిరసనలను వ్యూహాత్మకంగా సమన్వయం చేస్తున్నాయి. బయటికి మాత్రం ఇవన్నీ అమాయకపు విద్యార్థుల ఉద్యలాగా, యువత చేపడుతున్న సామాజిక పోరాటాలుగా ప్రొజెక్ట్ చేస్తుండటం అతిపెద్ద మోసం. వాస్తవానికి ఈ 101 సంస్థల్లో కేవలం 33 మాత్రమే యువత చేతుల్లో ఉండగా, మిగిలినవన్నీ అత్యంత ప్రమాదకరమైన రాజకీయ, ఉగ్రవాద భావజాలం గల వయోజనుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.
ఈ భారీ విధ్వంసక నెట్‌వర్క్‌కు ప్రధాన ఆర్థిక మద్దతుదారుడిగా నెవిల్లే రాయ్ సింఘం అనే అమెరికన్ టెక్ పారిశ్రామికవేత్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం షాంఘై కేంద్రంగా చైనాలో నివసిస్తున్న ఈ వ్యక్తి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ విధానాలకు మరియు వారి ‘న్యూ వరల్డ్ ఆర్డర్’ అజెండాకు బహిరంగ మద్దతుదారుడిగా కొనసాగుతున్నారు. ఈయన సమకూరుస్తున్న అప్పశప్పుల నిధులతోనే ‘కోడ్ పింక్’, ‘బ్రేక్ త్రూ న్యూస్’ లాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. హాతెమ్ బాజియాన్ లాంటి విద్యావేత్తల ముసుగులో ఇవి ఫ్రాన్స్ అల్లర్లను, గజా వివాదాలను, ఇతర ప్రాంతీయ ఘర్షణలను ఒకదానితో ఒకటి ముడిపెడుతూ ప్రపంచవ్యాప్తంగా యువతను తప్పుదోవ పట్టించి రెచ్చగొడుతున్నాయి.
ఈ మొత్తం కుట్రపూరిత ఎపిసోడ్‌లో అత్యంత బాధాకరమైన మరియు ఆందోళనకరమైన పరిణామం ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల స్పష్టమైన ద్వంద్వ వైఖరి. భారతదేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, చట్టపరమైన నిబంధనల ప్రకారం ముందస్తు అరెస్టులకు గురైన కొందరు వ్యక్తులను విడుదల చేయాలంటూ యూఎన్ ఇటీవల ఒక అడ్వైజరీ జారీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అక్రమ అరెస్టులను ప్రశ్నించడంలో తప్పులేనప్పటికీ, అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయతను శంకింపజేసే ప్రశ్నలు ఇక్కడే తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం లాంటి ప్రాంతాలలో దాడులు చేసి నిరపరాధుల ప్రాణాలు తీస్తున్నప్పుడు కనీసం స్పందించని ఐక్యరాజ్యసమితి, చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఉయ్గర్ ముస్లింలపై దశాబ్దాలుగా ప్రభుత్వమే సాగిస్తున్న నరమేధంపై మాత్రం కనీసం నోరు మెదచదు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో గానీ, ఇరాన్ ప్రభుత్వాలు తమ దేశ పౌరుల ముఖ్యంగా మహిళల హక్కులను అణచివేస్తున్నప్పుడు గానీ యూఎన్ పూర్తిగా మౌనం వహిస్తుంది. కానీ, భారత్ విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం వెనుక ప్రపంచ దేశాల ప్రభుత్వాలను, న్యాయ వ్యవస్థలను శాసించే ఒక శక్తిమంతమైన ‘డీప్ స్టేట్’ హస్తం ఉందన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఒకప్పుడు కేవలం పశ్చిమ దేశాల రాజకీయాలను శాసించిన ఈ డీప్ స్టేట్ నెట్‌వర్క్, ఇప్పుడు చైనా లాంటి నియంతృత్వ దేశాల నుంచి కూడా ఆపరేట్ అవుతోందన్న వాదనకు ఈ తాజా పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అంతర్జాతీయ డీప్ స్టేట్ నెట్‌వర్క్ యొక్క అంతిమ లక్ష్యాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడం, అనగా ‘రెజీమ్ చేంజ్’ (ప్రభుత్వ మార్పు) సాధించడం కూడా ప్రధానాంశంగా ఉంది. దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలో హెచ్చరించిన ‘2.5 ఫ్రంట్ వార్’ (సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనాలతో పాటు దేశం లోపల అంతర్గత అశాంతిని సృష్టించడం) ఇప్పుడు అచ్చం అలాగే కళ్లెదుటే ఆవిష్కృతమవుతోంది. బంగ్లాదేశ్‌లో జరిగిన తరహాలోనే విద్యార్థులను, యువతను పావులుగా వాడుకుని భారతదేశంలోనూ కృత్రిమ అస్థిరతను, అరాచకత్వాన్ని సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయి.
భారతదేశాన్ని ఈ అంతర్జాతీయ శక్తులు టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణాలలో విదేశీ నిధుల నియంత్రణ చట్టం అత్యంత కీలకమైనది. దేశంలోని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలకు విదేశాల నుంచి వస్తున్న అక్రమ నిధులకు, హవాలా మార్గాలకు మోడీ ప్రభుత్వం కఠినమైన చట్టాలతో ఉక్కుపాదం మోపుతోంది. ఈ నిధుల ప్రవాహం నిలిచిపోవడంతో ఉలిక్కిపడిన ఈ అంతర్జాతీయ లాబీకి భారత ప్రభుత్వం మింగుడుపడడం లేదు. ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత బలంగా ఎదుగుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో నేరుగా ఓడించలేక.. ఫేక్ నరేటివ్స్‌ను సృష్టించడం, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయించడం, విపక్షాలను ప్రభావితం చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను బలహీనపరచాలని చూస్తున్నారు.
ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో భారతీయ యువత అత్యంత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన తెలిపే హక్కును గౌరవిస్తూనే, విదేశీ శక్తులు మరియు ‘ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్’ లాంటి ముసుగు సంస్థల చేతిలో కీలుబొమ్మలుగా మారి జాతి వ్యతిరేక నెట్‌వర్క్‌ల ఉచ్చులో పడకూడదు. దేశ ప్రధానిని, అత్యున్నత న్యాయస్థానాలను, లేదా ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను నిరాధారంగా అగౌరవపరచడం ద్వారా దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా మసకబార్చే కుట్రపూరిత ప్రాపగాండాను గుడ్డిగా నమ్మడం దేశద్రోహంతో సమానమవుతుంది. ఇలాంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొని చట్టాల కింద కేసులు తెచ్చుకుంటే యువత ఉజ్వల భవిష్యత్తు పూర్తిగా నాశనమవుతుంది. భావోద్వేగాలను రెచ్చగొట్టే సోషల్ మీడియా అజెండాలను, ఆధారాలు లేని ఆరోపణలను పక్కనపెట్టి, వాస్తవాలను, దేశ రక్షణ అవసరాలను బేరీజు వేసుకుని అడుగులు వేయడం నేటి యువతకు అత్యంత అవసరం. దేశం ఉంటేనే భవిష్యత్తు ఉంటుందనే స్పృహతో ప్రతి పౌరుడూ అప్రమత్తంగా ఉండాలి.

(శివకుమార్ గనివాడ, సీనియర్ సోషల్ అనలిస్ట్, ganiwada@zohomail.in)