పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ప్రయోగం ప్రారంభమయ్యే సమయంలో ఇస్రో కీలక ప్రకటన చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ముందుగా ఇస్రో తెలిపింది. నేటి సాయంత్రం 4:08 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్ 1 వీటిని నింగిలోకి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా, శాటిలైట్‌లో సాంకేతిక సమస్యతో ప్రయోగం వాయిదా పడింది.
సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన బృహత్తర మిషన్ కాగా, ఇస్రో సహకారంతో సూర్యుడి బాహ్య వలయం కొరొనా గురించి తెలుసుకునే ప్రయత్నం సాగించేందుకు ఈ ప్రయోగం దోహద పడనుంది. అక్కడి వాతావరణం, ప్లాస్మా, అయానైజ్డ్ గ్యాస్.. వంటి అంశాలపై ఈఎస్ఏ అధ్యయనం చేయడం ప్రయోగం ముఖ్య లక్ష్యం.
అయితే మరికొద్ది గంటల్లో రాకెట్ ప్రయోగం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సాగాయి. కానీ అంతలోనే శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కౌంట్‌డౌన్ నిలిపివేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రాకెట్ ను రేపు సాయంత్రం 4.12 గం.కు ప్రయోగించడం జరుగుతుందని ప్రకటన జారీ చేసింది.
కాగా నేటి సాయంత్రం ప్రయోగం సఫలమయ్యేందుకు ఇస్రో సన్నద్దం కాగా, ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వెంటనే ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం రేపు సాగుతుండగా, సూర్యుడిపై పరిశోధనల కోసం దీనిని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు శాస్త్రవేత్తలు. రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలివచ్చారు. అయితే ప్రయోగం వాయిదా వేసినట్లు తెలుసుకున్న వారు, రేపు అనగా గురువారం రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకున్నారు.