- ఢిల్లీ పోలీసులకు తెగేసి చెప్పిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా!
న్యూఢిల్లీ, మహా.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ప్రభుత్వాల తీరు ఉందంటూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా నిప్పులు చెరిగారు. శాంతియుతంగా వ్యవహరిస్తానని హామీ ఇస్తూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట సమర్పించాల్సిన ‘పీస్ బాండ్’ పైన తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయబోనని ఆమె శనివారం తేల్చిచెప్పారు. భారత ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆమెను గతంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను విడుదల చేసే క్రమంలో భవిష్యత్తులో శాంతిభద్రతలు కాపాడతానంటూ రూ. 10 వేల వ్యక్తిగత పూచీకత్తు బాండ్‌పై సంతకం చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను చట్టవిరుద్ధమంటూ సవాలు చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తాజాగా స్పందించిన నేహా బోరా.. తాను పీస్ బాండ్‌పై సంతకం చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. “ఎవరి శాంతిని నేను కాపాడాలి?” అంటూ ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఒక సమావేశంలో మాట్లాడిన ఆమె, శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడి ప్రాథమిక ప్రజాస్వామిక హక్కని గుర్తుచేశారు. కానీ, ప్రభుత్వ విధానాలను లేదా తప్పులను ప్రశ్నిస్తే చాలు.. శాంతిభద్రతలకు భంగం కలిగించినట్లుగా భావించి అణచివేతకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పీస్ బాండ్‌ల పేరుతో స్వరాన్ని అణచివేయాలని చూస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఈ వివాదానికి దారితీసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ‘సర్’ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషనర్‌ల మధ్యే అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు భారీ నిరసనలు చేపట్టాయి. ఈ నిరసనల్లో ఏఐఎస్ఏ నేత నేహా బోరా క్రియాశీలకంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఢిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం న్యాయస్థానంలో ఊరట లభించకపోయినా, పీస్ బాండ్‌పై సంతకం చేసేది లేదని ఆమె మొండికట్టడం దేశ రాజధానిలో మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.







