Mahaa Daily Exclusive

  అమృత్‌సర్ `గోల్డెన్ టెంపుల్‌`పై కాల్పులు..! కారణం అదేనా..?

Share

పంజాబ్‌లో షూటర్లు పేట్రేగిపోయారు. సిక్కుల ప్రఖ్యాత ప్రార్థనా స్థలం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌పై కాల్పులు జరిపారు. ఒక రౌండ్ కాల్పులు జరిగాయి. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని నారాయణ్ సింగ్ చౌరాగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఖాల్సా దళ్ సభ్యుడిగా అనుమానిస్తోన్నారు.

 

గోల్డెన్ టెంపుల్‌పై కాల్పులు జరిపిన సమయంలో శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అక్కడే ఉన్నారు. ఆయనను దృష్టిలో పెట్టుకునే నారాయణ్ సింగ్ చౌరా ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

 

రెండు రోజులుగా అకల్ తఖ్త్ శిక్షను అనుభవిస్తోన్నారు సుఖ్‌బీర్ సింగ్ బాదల్. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న సీనియర్ నాయకుడాయన. కుడి కాలికి గాయం కావడం వల్ల కొద్ది రోజులుగా వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. ఈ స్థితిలోనూ అకల్ తఖ్త్ శిక్షలో పాల్గొంటోన్నారు.

 

2004- 2009 మధ్యకాలంలో పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నారంటూ అకల్ తఖ్త్ ఆయనపై సిక్కుల మతపరమైన చర్యలకు దిగింది. దీనికి శిక్షగా అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో టాయ్‌లెట్లను శుభ్రపర్చడం, ఫ్లోర్ క్లీనింగ్.. వంటి శిక్షను విధించింది.

 

మంగళవారం ఈ శిక్ష అమలులోకి వచ్చింది. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో పాటు శిరోమణి అకాలీదళ్ నాయకులు దిల్జీత్ సింగ్ చీమా, బిక్రమ్ సింగ్ మజీతియా, మహేందర్ సింగ్ గ్రెవాల్.. ఈ శిక్షలో పాల్గొంటోన్నారు. స్వహస్తాలతో టాయ్‌లెట్లను శుభ్రపరిచారు. గోల్డెన్ టెంపుల్ ఫ్లోర్, గోడలను క్లీన్ చేశారు. నడవలేని స్థితిలో ఉండటం వల్ల బాదల్‌ను ఇందులో నుంచి మినహాయించారు.

 

రెండో రోజు కూడా ఇది కొనసాగుతోంది. సుఖ్‌బీర్ సింగ్‌తో పాటు ఆయా నాయకులు ఈ ఉదయమే గోల్డెన్ టెంపుల్‌కు చేరుకున్నారు. అకల్ తఖ్త్‌లో పాల్గొన్నారు. నడవ లేని స్థితిలో ఉండటం వల్ల బాదల్.. సేవా కార్యక్రమాలను నిర్వహించే చోట వీల్‌చైర్‌పై కూర్చుని ఉన్నారు.

 

ఆ సమయంలో నారాయణ్ సింగ్ చౌరా కాల్పులకు దిగాడు. ప్యాంట్ జేబులో పిస్టల్‌ను పెట్టుకుని లోనికి వచ్చాడతను. బాదల్ కూర్చుని ఉన్న ప్రదేశానికి సమీపానికి చేరిన వెంటనే పిస్టల్‌ను బయటికి తీశాడు. దీన్ని గమనించిన బాదల్ అనుచరులు, అకాలీదళ్ నాయకులు ఉలిక్కిపడ్డారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ లోపే నారాయణ్ సింగ్ కాల్పులు జరిపాడు.

 

ఆ వెంటనే అతన్ని పట్టుకున్నారు. గోల్డెన్ టెంపుల్ ఆవరణ బయట ఉన్న పోలీసులకు అతన్ని అప్పగించారు. నారాయణ్ సింగ్ కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాదల్ సహా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు.