తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై సీఎంల కీలక భేటీ..
– ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు.
– సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.
– అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
ముంబై, మహా.
తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ముంబై వేదికగా సానుకూల వాతావరణంలో కీలక చర్చలు జరిగావి. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయింది. ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున గట్టిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు ఆవశ్యకతను, దాని ప్రాధాన్యతను వివరంగా వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు, అక్కడి గిరిజనులు, ఆదివాసీల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు పాత్ర ఎంతో కీలకమని మహారాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. 1975 నుంచి ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నప్పటికీ ఆశించిన పురోగతి లేదని, 2016లో నిర్ణయించిన 148 మీటర్ల ఎత్తుతో తెలంగాణ నీటి అవసరాలు పూర్తిస్థాయిలో నెరవేరవని స్పష్టం చేశారు. ఒకవేళ 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారమే పూర్తి స్థాయి పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, ఆదివాసీ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎంతగానో అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని కోరారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాకుండా, తెలంగాణ, మహారాష్ట్రలను మరింత అనుసంధానించే మైత్రి వారధిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, బ్యారేజీ ఎత్తు పెంపు ప్రతిపాదనను పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, దీనివల్ల జరిగే ముంపు ప్రభావం, నీటి లభ్యత, పర్యావరణ మరియు సాంకేతిక అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలకు ఎటువంటి ప్రతికూల ప్రభావం కలగకపోతే గత ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో సంయుక్త అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. కేంద్ర జల సంఘం సహకారంతో అవసరమైన అన్ని అధ్యయనాలు పూర్తి చేసి తదుపరి కార్యాచరణను రూపొందించాలని సూచించారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్యారేజీ ఎత్తు పెంపుపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇరు రాష్ట్రాల మధ్య తదుపరి అధ్యయనాలు, సానుకూల చర్చలు నిరంతరం కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తమవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.






