న్యూఢిల్లీ, మహా.
దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీ వ్యాపారులకు కీలక భరోసానిచ్చారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి బాధలను తాము పూర్తిగా అర్థం చేసుకుంటున్నామని, ప్రతి వ్యాపారికి అండగా నిలుస్తామని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దేశ రాజధానిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోందని ఆయన మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం మెట్రో సేవలను నిలిపివేసి, కీలక రహదారులను మూసివేస్తోందని, తద్వారా దేశ రాజధాని ఢిల్లీని అప్రకటిత దిగ్బంధంలోకి నెట్టేస్తోందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు చోరీ జరిగితే దేశంలో ఏ ఒక్కరూ, ఏదీ సురక్షితంగా ఉండబోదని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాపారాలు, దుకాణాలు, ప్రజల పొదుపుతో పాటు రాబోయే తరాలైన పిల్లల భవిష్యత్తు కూడా తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఓటు చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. సీఈసీని ఆ పదవి నుంచి తొలగిస్తే కేవలం 30 సెకన్లలోనే దేశ రాజధానిలో జరుగుతున్న ఆందోళనలు అన్నీ సర్దుమణుగుతాయని, నిరసనలు ఆగిపోతాయని ఆయన పేర్కొన్నారు.






