- అర్నాబ్ తుపాను ప్రభావం
- తెలంగాణకు భారీ వర్ష సూచన
- నేడు , రేపు వర్షాలు
హైదరాబాద్, మహా : వర్షాలు లేక ఎండిపోతున్న పంటలు చూసి అల్లాడుతున్న రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ
బుధవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ బాద్ జిల్లాల్లో అతిభారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.








