ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు మహారాష్ట్ర సీఎం.
* సీఎం రేవంత్ ప్రత్యేక ఆహ్వానం.
* డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడం, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖ నాయకులను ఆహ్వానించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సదస్సుకు ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించిన అంశాలపై జరిగిన సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్‌తో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వివరాలను పంచుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించి సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల మధ్య కీలక ప్రాజెక్టులపై చర్చ జరిగిన సందర్భంలో పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి ఉందని, హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపినట్లు వెల్లడైంది.








