Mahaa Daily Exclusive

  జగన్‌ 2.0 అంటే మా 10 ఎక్స్‌ చూపిస్తాం!

Share

జగన్‌ 2.0 అంటే మా 10 ఎక్స్‌ చూపిస్తాం!
* బెదిరింపులకు భయపడేది లేదు.
* కూటమి ఐక్యతపై పవన్‌ కల్యాణ్‌ స్పష్టీకరణ.
* వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌
అమరావతి, మహా.
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. జగన్‌ 2.0 అంటూ మాట్లాడితే తాము 10 ఎక్స్‌ చూపిస్తామని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు. మంగళవారం నిర్వహించిన ఎన్డీఏ మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన, రాజకీయాల్లో ప్రజల మద్దతే అత్యంత కీలకమని, ప్రజల తీర్పును శిరసావహిస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపై ఉందని హితవు పలికారు.

జగన్‌ వ్యవహారశైలిని తప్పుబట్టిన పవన్‌ కల్యాణ్‌.. గతంలోనూ ఇలాంటి తీరును ప్రదర్శించినందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, అనుసరించే విధానాలు సమాజంపై, ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో బేరీజు వేసుకోవాలని సూచించారు. బలహీనులే తరచూ బెదిరింపుల భాషను ఉపయోగిస్తారని, బలమైన నాయకులు ఎప్పుడూ అలా మాట్లాడరని స్పష్టం చేశారు. ప్రత్యర్థుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాజకీయంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లుగానే జగన్‌ ఇకనైనా జనజీవన స్రవంతిలోకి రావాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. కేవలం పరిమిత వాతావరణంలో ఉండి విమర్శలు చేయడం కాకుండా, నేరుగా ప్రజల మధ్యకు వెళ్లినప్పుడే వారి అసలు సమస్యలు, కష్టాలు, ఆకాంక్షలు ఏమిటో అర్థమవుతాయని పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించడం రాజకీయ నాయకులకు అత్యంత ఆవశ్యకమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాభిడ్యే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాజకీయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా భాగస్వామ్య పక్షాల మధ్య సంపూర్ణ సమన్వయం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల ఐక్యత రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయాల్లో సీట్ల సర్దుబాటు, వ్యూహాత్మక చర్చలు సహజమేనని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటూ కూటమి పటిష్టంగా ముందుకు వెళ్తుందని భరోసా ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల రాజకీయాలు వేరుగా ఉంటాయని, స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పరిస్థితులు మరింత భిన్నంగా మారుతాయని పవన్‌ వివరించారు. ఎక్కువ స్థానాల్లో సర్దుబాట్లు చేసుకోవాల్సి రావడంతో క్షేత్రస్థాయిలో చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. నామినేషన్ల పర్వంతో మారుతున్న స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల ఎంపికలో పాటిస్తున్న జాగ్రత్తలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.