Mahaa Daily Exclusive

  సైబర్ మోసాల్లో బాధితులకు….బ్యాంకులే పరిహారం చెల్లించాలి…

Share

  • సైబర్ మోసాల్లో బాధితులకు
  • బ్యాంకులే పరిహారం చెల్లించాలి
  • సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మహా : డిజిటల్ సైబర్ మోసాల బాధితులకు ఊరట కల్పించే దిశగా సుప్రీంకోర్టు కీలక చర్యలకు ఉపక్రమించింది. డిజిటల్ మోసాల్లో బాధితులు కోల్పోయిన నగదుకు బ్యాంకులే బాధ్యత వహించేలా నిబంధనలు తీసుకురావాలని తేల్చి చెప్పింది. ఇలాంటి మోసాల్లో నష్టపోయిన వారికి బ్యాంకుల ద్వారానే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీల పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టడంలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఖాతాల్లో జరిగే అసాధారణ లావాదేవీలను గుర్తించి, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయడం బ్యాంకుల ప్రాథమిక బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. అనుమానాస్పద లావాదేవీల కారణంగా ఖాతాదారులు తమ సొమ్మును కోల్పోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ ఏడాది డిజిటల్ నేరాలు 50 శాతం తగ్గినప్పటికీ, బాధితులు రూ.800 కోట్లు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు వాట్సాప్‌ సంస్థకూ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు 9,400 అనుమానాస్పద ఖాతాలను నిషేధించినట్లు ఉన్నత న్యాయస్థానానికి వాట్సాప్ వెల్లడించింది.

మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 31 నుంచి తీసుకురానున్న కేవైసీ సవరణ మార్గదర్శకాలనూ పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు వర్తించే బ్యాంకుల జాబితాను సమర్పించాలని ఆర్‌బీఐని ఆదేశించింది. నూతన మార్గదర్శకాలు అమలు కానుండటంతో డిజిటల్ అరెస్ట్ మోసాల నియంత్రణలో వాటి ప్రాధాన్యంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది.