- స్మిత్ మచ్చర్ కు యూఏఈ సలాం
- విమాన హైజాక్ యత్నాన్ని అడ్డుకున్న భారత పైలట్‌కు అరుదైన గౌరవం
- ఆర్డర్ ఆఫ్ జాయెద్ II, ఫస్ట్ క్లాస్ పురస్కారాన్ని ప్రదానం చేసిన
- ఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
న్యూఢిల్లీ, మహా : విమానాన్ని హైజాక్ చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ధైర్యంగా ఎదుర్కొని, 172 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన ఫ్లైదుబాయ్ విమాన సిబ్బందికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భారత పైలట్ స్మిత్ మచ్ఛర్ సహా విమాన సిబ్బందికి ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II, ఫస్ట్ క్లాస్’ పురస్కారాన్ని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రదానం చేశారు. మంగళవారం అబుదాబిలో జరిగిన కార్యక్రమంలో ఈ గౌరవాన్ని అందించారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్ జడ్1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా 29 ఏళ్ల ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమ్మామ్ అల్ హమ్మామీ.. అత్యవసర గొడ్డలితో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై దాడి చేసినట్లు సమాచారం. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో విమానం ఒక్క నిమిషం కంటే తక్కువ సమయంలో సుమారు 17 వేల అడుగుల ఎత్తు నుంచి దిగివచ్చింది. తీవ్ర గాయాలున్నప్పటికీ కెప్టెన్ మచ్ఛర్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. తిరుగు ప్రయాణం కోసం అదే విమానంలో ఉన్న మరో పైలట్ యాక్సెస్ కోడ్ సాయంతో కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు. క్యాబిన్ సిబ్బంది, పలువురు ప్రయాణికుల సహకారంతో దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మరో పైలట్, ఆయనతో ఉన్న కో-పైలట్ విమాన నియంత్రణను చేపట్టి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 172 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు ఫ్లైదుబాయ్ వెల్లడించింది.భారత పైలట్‌కు ప్రత్యేక గుర్తింపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు తొలుత తబుక్‌లో చికిత్స అందించారు. అనంతరం ఆయనను అబుదాబిలోని ఆసుపత్రికి తరలించారు. అక్టోబర్ 3న దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
మంగళవారం అబుదాబిలో జరిగిన కార్యక్రమంలో యూఏఈ అధ్యక్షుడు మచ్ఛర్ భుజంపై చేయి వేసి పలకరించిన దృశ్యాలు విడుదలయ్యాయి. విమాన సిబ్బంది చూపిన అప్రమత్తత, వృత్తిపరమైన నైపుణ్యాన్ని యూఏఈ నాయకులు ప్రశంసించారు. ప్రజల ప్రాణాలు, భద్రతను కాపాడటం దేశ అత్యున్నత ప్రాధాన్యాల్లో ఒకటని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఉగ్రదాడికి కుట్ర చేసినట్లు దర్యాప్తులో వెల్లడి
యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షంసీ అక్టోబర్ 9న ఈ ఘటనను ఉగ్రవాద చర్యకు ప్రయత్నంగా అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల నుంచి ప్రేరణ పొంది, ముందస్తు ప్రణాళికతో నిందితుడు పైలట్ వృత్తిని ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయ ప్రయాణికుల టెర్మినల్‌ను విమానంతో ఢీకొట్టి, ఆత్మాహుతి దాడి ద్వారా అత్యధిక ప్రాణనష్టం కలిగించాలనేది నిందితుడి లక్ష్యంగా ఉందని విచారణాధికారులు గుర్తించినట్లు సమాచారం. నిందితుడు తాను ఒంటరిగానే వ్యవహరించినట్లు అంగీకరించినప్పటికీ, ఈ కుట్రకు సంబంధించి ఇతరుల ప్రమేయం ఉందా అనే అంశంతో పాటు అన్ని కోణాల్లో న్యాయపరమైన విచారణ కొనసాగుతోంది.
ప్రధాని మోడీ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలో కెప్టెన్ మచ్ఛర్‌ను ‘హీరో’గా అభివర్ణించారు. ఈ ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆరుగురు ఇజ్రాయెల్ ప్రయాణికులకు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ పౌర ధైర్య పురస్కారాలను అందించారు. కోలుకున్న తర్వాత భారత పైలట్‌కు కూడా అదే గౌరవాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఘటన జరిగిన రోజున విమానంలోని ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఫ్లైదుబాయ్ విమానంలో తబుక్ నుంచి ఇజ్రాయెల్‌కు తరలించారు. ఈ ఘటనకు ముందు టెల్ అవీవ్‌కు రోజుకు పది వరకు విమాన సర్వీసులు నడిపిన ఫ్లైదుబాయ్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇజ్రాయెల్‌కు రాకపోకలను తదుపరి ప్రకటన వచ్చే వరకు నిలిపివేసింది. విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో భారత పైలట్ సహా సిబ్బంది చూపిన ధైర్యసాహసాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి.






