Mahaa Daily Exclusive

  మియాపూర్ భూముల​ కేసులో సుప్రీం తీర్పు…

Share

  • మియాపూర్ భూముల​ కేసులో సుప్రీం తీర్పు
  • 550 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే
  • సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గెలుపు

న్యూఢిల్లీ, మహా : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ సర్వే నెంబర్‌ 100,101ల భూ వివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ రెండు సర్వే నెంబర్లలో 550ఎకరాల భూమి తమందంటూ కొందరు గతంలో ఆక్రమించే ప్రయత్నం చేశారు. అయితే 2003లో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రైవేట్‌ వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను గురువారం న్యాయస్థానం కొట్టివేసింది. 550 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమి పరిరక్షణకు చూపిన ప్రత్యేక చొరవను కోర్టు అభినందించింది.

వాస్తవానికి మియాపూర్ భూములకు సంబంధించి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని 2003లోనే ఉమ్మడి హైకోర్టు సమర్థించింది. ఈ భూములను జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధమైన వారసులైన అమీరున్నిషా ,ఇతరుల నుండి చట్టబద్ధంగా పొందామని, తమ ఇర్రివోకబుల్ జీపీఏ, సనద్ హక్కులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని అప్పీల్‌ పిటిషన్‌ వేసిన పార్థసారధి, సువిశాల్‌ జైన్‌లు కోర్టును అభ్యర్ధించారు. రిజిస్టర్డ్ పత్రాలను రద్దు చేసే అధికారం శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు లేదని కోర్టులో వాదించారు. ఈ వాదనలపై ప్రభుత్వ న్యాయవాదులు కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. జాగీర్దార్ కైసరుద్దీన్‌కు అప్పట్లోనే పరిహారం చెల్లించినందున ఈ భూములపై ​​ఎటువంటి హక్కులను క్లెయిమ్ చేసే అవకాశం వారసులుగా చెబుతున్న వారికి లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది రూపాయల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా కోర్టు అనుమతించబోదని, ఇటువంటి విషయాల్లో కోర్టు మౌనంగా ఉండలేదని పేర్కొంది.