Mahaa Daily Exclusive

  అర్నబ్ నష్టం రూ. 4,600 కోట్లు..

Share

  • అర్నబ్ నష్టం రూ. 4,600 కోట్లు
  • ప్రాథమికంగా అంచనా వేసిన ప్రభుత్వం
  • కోనసీమలో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన
  • నేడు ఏపీకి రానున్న కేంద్ర బృందాలు
  • కోనసీమలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు

కోనసీమ, మహా : ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని వణికించిన తీవ్ర ఆర్నాబ్ తుఫాన్ ధాటికి ప్రాథమిక అంచనాల ప్రకారమే రాష్ట్రానికి రూ. 4,600 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం, గచ్చకాయలపొర గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విపత్తు పరిస్థితులు మరియు సహాయక చర్యల వివరాలను ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు శుక్రవారం ఏపీకి రానున్నాయని సీఎం తెలియజేశారు.

గతంలో వచ్చిన హుదూద్, తిత్లీ, మొంతా తుఫాన్లు మూడు దశాబ్దాల క్రితం నవంబర్ 6న సంభవించిన హరికేన్ విపత్తులను గుర్తుచేస్తూ.. గత అనుభవాలతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లే ఈసారి ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని స్పష్టం చేశారు. విపత్తు వేళ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమించిందని, అయినప్పటికీ దురదృష్టవశాత్తూ ఏడుగురు మరణించడం బాధాకరమన్నారు. సముద్ర గర్భంలో తలెత్తే తుఫాన్లను ఆపలేమని, కానీ సమర్థవంతమైన యాజమాన్యంతో ఆస్తి, ప్రాణ నష్టాలను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలను కొంతమంది రాజకీయం చేస్తూ ఎగతాళిగా మాట్లాడినా, యంత్రాంగం ఏమాత్రం అధైర్యపడకుండా ప్రజా సేవకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

తీవ్రంగా ప్రభావితమైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక్క కోనసీమ జిల్లాలోనే ఏకంగా 8,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినందున, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నుండి 1,000 మంది సాంకేతిక సిబ్బందిని రప్పిస్తున్నామని తెలిపారు. అవసరమైతే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సాయం కూడా తీసుకుంటామన్నారు. ఆర్టీజీఎస్, అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల సహాయంతో రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు, చెరువులకు గండ్లు పడకుండా నివారించడం, టెలీకమ్యూనికేషన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. బాధితులకు, రైతాంగానికి అందించే సహాయక చర్యలపై సీఎం పూర్తి హామీ ఇచ్చారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ. 1,500, ఆయిల్ పామ్ చెట్టుకు రూ. 1,500 చొప్పున పరిహారంతో పాటు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రతి కుటుంబానికి 25 కిలోల ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల ప్యాకెట్ మరియు తక్షణ వ్యయాల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ముందస్తుగానే పంటల బీమా సౌకర్యం కల్పించినందున దిగుబడి తగ్గిన రైతులకు ఇన్సూరెన్స్ ద్వారా పూర్తి పరిహారం దక్కేలా చూస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టం అంచనాలు రాగానే నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.

విపత్తుతో ఆర్థికంగా నలిగిపోయిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోలేదని, తమ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో బాధితులందరికీ పూర్తిస్థాయి పరిహారం చేరే వరకు, విద్యుత్ మరియు సాధారణ జీవనం పునరుద్ధరించబడే వరకు ప్రభుత్వం కడపటి బాధితుడి పక్షాన నిలబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.