- సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా
- దసరా, దీపావళి బోనస్‌లు కలిపి ఒక్కొక్కరికి రూ.2.65 లక్షలు
- మరో కానుక ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- నవంబర్ 5 న దీపావళి బోనస్ కార్మికుల ఖాతాలలో జమ చేయాలి
- సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, మహా : సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరో పండుగ కానుక ప్రకటించింది. ఇప్పటికే దసరా సందర్భంగా లాభాల వాటా బోనస్ అందుకున్న కార్మికులకు ఇప్పుడు దీపావళి బోనస్ కూడా అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 5వ తేదీన అర్హులైన కార్మికుల బ్యాంకు అకౌంట్లలో దీపావళి బోనస్ నగదును జమ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈసారి దీపావళి బోనస్ కింద ఏకంగా రూ.419 కోట్లు చెల్లించనున్నారు. అర్హత కలిగిన ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 అందనుందని పేర్కొన్నారు. దీంతో సుమారు 38 వేల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది.
సింగరేణి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ భట్టి విక్రమార్క శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పీఎల్ఆర్) బోనస్ చెల్లింపులను నవంబర్ 5వ తేదీన చేపట్టాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈసారి మొత్తం రూ.419 కోట్లను బోనస్ రూపంలో పంపిణీ చేయనున్నారు. ఈ ఆదేశాల మేరకు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంబంధిత పర్సనల్, ఫైనాన్స్ విభాగాల అధికారులతో మాట్లాడారు. నిర్ణీత తేదీన కార్మికుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అయ్యేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇటీవల దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు లాభాల వాటా బోనస్ కింద దాదాపు రూ.600 కోట్లు చెల్లించారు. తాజాగా దీపావళి బోనస్ కోసం మరో రూ.419 కోట్లు కేటాయించారు. దీంతో రెండు పండుగల బోనస్‌ల రూపంలో నెల రోజుల వ్యవధిలోనే ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ.2.65 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం అందనుంది. ఈ రెండు బోనస్‌ల కోసం సంస్థ మొత్తం సుమారు రూ.1,020 కోట్లను వెచ్చిస్తోంది. దీంతో పండుగల సమయంలో సింగరేణి కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక వెసులుబాటు లభించనుంది.
అయితే దీపావళి బోనస్ చెల్లింపులకు కొన్ని అర్హత నిబంధనలు విధించారు. ఈ ప్రయోజనం నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోని కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. సింగరేణి సంస్థలో పనిచేసే అధికారులకు ఇది వర్తించదని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో కనీసం 190 పని దినాలు.. ఓపెన్‌కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తి బోనస్ అందుతుందని తెలిపింది. అంతకంటే తక్కువ రోజులు పనిచేసిన వారికి వారు విధులు నిర్వహించిన కాలానికి అనుగుణంగా నిష్పత్తి ప్రకారం బోనస్ లెక్కిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే గత ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 రోజులు పనిచేసి ఉండాలని పేర్కొన్నాయి. ఈ నిబంధనల ప్రకారం సుమారు 38 వేల మంది కార్మికులు దీపావళి బోనస్‌కు అర్హత పొందనున్నారు.
సింగరేణి సంస్థ రాష్ట్రానికి వెలుగులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని తెలిపారు. బొగ్గు రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. సింగరేణి కార్మికులకు సంస్థ సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బోనస్ రూపంలో అందే మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవడంతో పాటు.. వీలైనంత మేర పొదుపు చేసుకోవాలని సూచించారు. పండుగల స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేస్తూ గనుల వారీగా, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కార్మికులను కోరారు.







