- పెట్టుబడులకు, ప్రజల జీవన ప్రమాణాలకు
- హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతాం
- యువతకు నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలు
- జిల్లాల విద్యార్థులకూ ఐటీ రంగంలో ప్రాధాన్యం
- ఇన్ఫోసిస్ విస్తరణతో హైదరాబాద్‌పై అంతర్జాతీయ సంస్థల విశ్వాసం మరింత బలోపేతం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మహా : పెట్టుబడులకు అనుకూలమైన నగరంగానే కాకుండా, ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించేందుకు అనువైన ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన పరిపాలన, నిరంతర విద్యుత్ సరఫరా, పర్యావరణహిత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో విస్తరణలో భాగంగా నిర్మించిన నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. సంస్థ ప్రస్థానం, అంతర్జాతీయ కార్యకలాపాలు, పోచారం క్యాంపస్ ప్రత్యేకతలు, నూతన భవన విస్తరణ, ఆధునిక సదుపాయాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఉప ముఖ్యమంత్రి, మంత్రికి వివరించారు. అనంతరం వారు నూతన కార్యాలయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్‌లో మరోసారి పెట్టుబడులు పెట్టడం నగరంపై ఆ సంస్థకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 48 వేల మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, పది లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఐటీ రంగం వేలాది కుటుంబాల జీవితాల్లో ఆర్థిక, సామాజిక మార్పులకు కారణమైందని, యువతకు ఉపాధితోపాటు కుటుంబాల అభ్యున్నతికి బాటలు వేసిందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)తో సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడుతున్న నేపథ్యంలో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ప్రాక్టికల్ అనుభవం, ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచాలని, ముఖ్యంగా జిల్లాల కళాశాలల విద్యార్థులకు ఐటీ రంగంలో సమాన అవకాశాలు కల్పించాలని ఇన్ఫోసిస్‌ను కోరారు.







