- అనకొండను మరిపిస్తున్న నిమ్స్ అక్రమాలు
- కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
- లక్ష్మీభాస్కర్ పాత్రపై ఆరా
- ఉద్యోగుల నియామకాలలో అక్రమాలు
హైదరాబాద్, మహా : నిమ్స్ ఆస్పత్రి అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. గురువారం దాదాపు 15 గంటలపాటు ఏసీబీ, డ్రగ్ కంట్రోల్, ఫుడ్‌సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కింది స్థాయి ఉద్యోగుల నియామకంలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో శుక్రవారం ఏసీబీ ఆరా తీస్తోంది. నిమ్స్‌లో స్కిల్డ్, నాన్ స్కిల్డ్ కలిపి మొత్తం 540 మంది ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్‌పేషెంట్ల వద్ద వసూలు చేసుకునేందుకు సిబ్బందికి ఓకే చెప్పినట్లు సమాచారం. జీతంతో పాటు నెలకు రూ.30 వేలు సంపాదించుకోవచ్చని చెప్పినట్లు ఆరోపణలున్నాయి. సెక్యూరిటీ కాంట్రాక్ట్ టెండర్ వేయకుండా పాత సంస్థకే కట్టబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. నిమ్స్ అక్రమాల్లో లక్ష్మీభాస్కర్ కీలకపాత్ర పోషించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరిస్తోంది.
ఆదాయానికి మించిన ఆస్తులు వ్యవహారం కేసులో నిమ్స్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ను ఏసీబీ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారించిన అధికారులు, ఆయన బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తులు, సన్నిహితుల నివాసాల్లో తనిఖీలు నిర్వహించి పలు కీలక ఆధారాలను సేకరించారు. తాజాగా నిమ్స్‌లో వివిధ విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. గతంలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టుల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. పలు విభాగాలకు సంబంధించిన టెండర్ల ఆహ్వానం నుంచి కాంట్రాక్టుల కేటాయింపుల వరకు నిబంధనల అమలు, బిడ్‌ల పరిశీలన, ఆయా సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలకు సంబంధించిన పత్రాలను అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాల్లో డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌తో పాటు గతంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఇతర అధికారుల పాత్ర పైనా ఆరా తీస్తున్నారు. మరోవైపు మందుల కొనుగోళ్లు, సరఫరా, నాణ్యతా ప్రమాణాలపైనా ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిమ్స్‌కు వివిధ మెడికల్ కంపెనీల నుంచి రేట్ కాంట్రాక్టుల ప్రకారం డీలర్లు మందులు సరఫరా చేస్తుంటారు.
మందుల నాణ్యతపై అనుమానాలు
గతంలో కొనుగోలు చేసిన కొన్ని మందుల నాణ్యతపై పలు అనుమానాలు రావడంతో నెల రోజుల క్రితం కొన్ని ఔషధాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. మందుల సరఫరాలో కమీషన్లు తీసుకుని నాణ్యత ప్రమాణాలు లేని ఔషధాలను సరఫరా చేశారా ? లేక కొనుగోళ్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారా? అన్న కోణాల్లోనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్లు, కాంట్రాక్టులు, మందుల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు, ఇతర ఆధారాలను విశ్లేషించిన తర్వాతే ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తున్న నిమ్స్‌లో అవినీతి ఆరోపణలు రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో అంతర్గత విభేదాలు, వైద్యుల మధ్య రాజకీయాలు, సంస్థ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







