Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్ర….

Share

  • హైదరాబాద్‌లో నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్ర.
  •  నాంపల్లి బీజేపీ కార్యాలయంలో సన్నాహక భేటీ.
  • విస్తృత ఏర్పాట్లపై నేతల సుదీర్ఘ చర్చ

హైదరాబాద్, మహా.

దేశ రాజధాని నుంచి రాష్ట్ర రాజకీయాలపై మరోసారి ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా నవంబర్ 2న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు ఈ సమావేశానికి దిశానిర్దేశం చేశారు.
సమష్టి కృషితోనే విజయవంతం: రాంచందర్ రావు
ఈ సమావేశంలో పాదయాత్ర నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. నవంబర్ 2న జరగనున్న మహా పాదయాత్రను జయప్రదం చేసేందుకు పార్టీ శ్రేణులన్నీ సమష్టిగా శ్రమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా, వివిధ విభాగాల మధ్య అద్భుతమైన సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

రూట్ మ్యాప్ ఇదే..

నవంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతమైన బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి ఈ మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అశోక్‌నగర్, హిమాయత్‌నగర్ మీదుగా మొజాంజాహీ మార్కెట్ కూడలి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. యాత్ర ముగింపు అనంతరం మొజాంజాహీ మార్కెట్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించనున్నారు.

ప్రతిపక్ష విమర్శలకు దీటైన బదులు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తదితర అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార విమర్శలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ మహా పాదయాత్ర సాగనుంది.ఈ సన్నాహక సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, శ్రీ బండారు శాంతికుమార్, ప్రముఖ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని పాదయాత్ర విజయానికి అవసరమైన పలు కీలక సూచనలు చేశారు.

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

ఇదే సందర్భంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి.. సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం పటేల్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.