బోధించు.. సమీకరించు.. పోరాడు.. అనే నినాదంతో ముందుకెళ్లి అణగారిన వర్గాలు, నిరుపేదల పక్షాన నిలబడు. అమాయకుల గొంతువై వినిపించు. చరిత్రను తిరగరాయు అంటూ బోధించారు మహానీయుడు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్. అంతేకాదు.. చదువును నమ్ముకో విలువను పెంచుకో అంటూ హితబోధ చేశారు. తనకు జరిగిన అవమానాన్ని భవిష్యత్ తరాలకు ఎదురవ్వొద్దంటూ అక్షరాల తోటలో వ్యవసాయం చేశారు అంబేద్కర్. పుస్తకాలతో కుస్తీ చేసి జ్ఞానాన్ని సంపాదించి భవిష్యత్ తరాలకు భరోసాగా నిలిచారు. ప్రపంచ దేశంలో కెల్లా అత్తిపెద్ద రాజ్యాంగాన్ని రచించి యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. నేడు అంబేద్కర్ 68వ వర్ధంతి. ఏప్రీల్ 14, 1891లో జన్మించిన భీంరావ్ రాంజీ అంబేద్కర్(డా. బాబాసాహెబ్ అంబేద్కర్) ప్రముఖ భారత న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, రాజకీయ నేత, భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి. అంటరానితం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతోగానో కృషి చేశారు. నేడు అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయంటే ఈయనే కారణం. అంతేకాదు… స్త్రీలకు రిజర్వేషన్ల విషయంలో కూడా ఈయనే కారణం. వీటితోపాటు ప్రతి ఒక్కరూ ఓటు వేస్తున్నారంటే అంబేద్కరే కారణం. లైబ్రేరీని తన జీవిత పాఠంగా మార్చుకున్న అంబేద్కర్ ముందుచూపుతో రాజ్యాంగం రచించారు. అందులో ఒకటి రాష్ట్రాల ఏర్పాటు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం నేడు తెలంగాణ ఏర్పడి అభివృద్ధిలో దూసుకెళ్తుందంటే ముఖ్యంగా అంబేద్కర్ కారణం. అంబేద్కర్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 1990లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను మరణాంతరం అందించింది. ఇండియానే కాదు.. ఇతర దేశాలు సైతం ఆయనను ఇప్పటికీ కొనియాడుతుంటాయి. ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అందుకే ఆయనకు ప్రపంచంలో ఎవరికి లేని విగ్రహాలు అంబేద్కర్ కు ఉన్నాయి. ఇండియాలో ఏ ఊరికెళ్లినా మొదటగా కనిపించేది అంబేద్కర్ విగ్రహమే. 65 ఏళ్ల వయసులో డిసెంబర్ 6, 1956న ఆయన కన్నుమూశారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను భారత దేశంతోపాటు ప్రపంచ దేశాలను అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తాయి. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బ్రతకాలని గొంతెత్తి చాటిన మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.