రానున్న 6 నెలలకు సంబంధించి శాఖ పరమైన చర్యలపై చర్చ
ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్ల పై చర్చించిన మంత్రి గొట్టిపాటి
రానున్న 6 నెలల్లో విద్యుత్ డిమాండ్, సరఫరాల అంచనాపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం
అమరావతి:* గత ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం విద్యుత్ రంగానికి సంబంధించి ట్రాన్స్ కో, జెన్ కో, డిస్క్ంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే 6 నెలలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరాతో పాటు పలు అంశాలను చర్చించారు. ఆరు నెలలకు సంబంధించి విద్యుత్ వినియోగం, డిమాండ్ లకు అనుగుణంగా ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి అనే దానిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు. గత ఐదేళ్ల పాటు చేసిన చారిత్రాత్మక తప్పిదాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు గుది బండగా మారాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ ఎదురు కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో ఉత్పత్తిని… డిమాండ్ మేరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ కాలాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతుందో.., ఎప్పుడు తగ్గుతుందో పరిశీలించి దానికి తగినట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు. అదే విధంగా లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా, ఫౌల్ట్రీ రంగాలకు ఇచ్చే రాయితీలపై అధికారులతో మంత్రి చర్చించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందించే ఉచిత విద్యుత్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. రాబోయే 6 నెలల కాలానికి విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ… లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని మంత్రి పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జెన్ కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్ కో జేఎండీ కీర్తీ చేకూరి తో పాటు డిస్క్ం ల సీఎండీలు, పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Post Views: 23