Mahaa Daily Exclusive

  14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు — మంత్రి డా.నిమ్మల రామానాయుడు

Share

ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశ్యంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్దరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు. సాగునీటి సంఘాలకు మూడు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీకు, మూడో రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సేవా దృక్పధంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతి నిధులుగా ఉండటం ఎంతో అవసరమని, అటు వంటి ఎన్నికల్లో ఎటు వంటి వర్గ, పార్టీ పోరు లేకుండా సాధ్యమైనంత మేర ఏకగ్రీవంగా ప్రతి నిధులను ఎన్నుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
దేశానికి వెన్నెముఖ అయిన రైతాంగం సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2015 లో తమ ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా ప్రతి నిధులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం వాటి విలువను గుర్తించ కుండా 2020లో సాగు నీటి సంఘాలను అన్నింటినీ రద్దు చేయడం జరిగిందన్నారు. రైతులు, వ్యవసాయం పై గత ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యదోరణికి ఇది నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వం సాగు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు ఎటు వంటి నిధులు విడుదల చేయకుండా ప్రాజెక్టులను అన్నింటినీ గాలికి వదిలేసిందన్నారు. ఫలితంగా గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోవడం జరిగిందన్నారు. ఈ మద్య రైవస్ కెనాల్ గేటు కూడా కొట్టుకు పోయినట్లు ఆయన తెలిపారు. అటు వంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకై తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజక్టుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు ఆయన తెలిపారు.