Mahaa Daily Exclusive

  పోలీసు పేరు వినిపిస్తే చాలు.. నేరగాళ్లు భయపడాలి..

Share

  • ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచే బాధ్యత మీదే
  • పైరవీలకు తావులేకుండా పోలీసుశాఖలో పదోన్నతులు
  • ట్రాన్స్‌జెండర్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
  • యంగ్‌ఇండియా పోలీసు స్కూలుకు 50 ఎకరాలు
  • ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
  • ఎస్డీఆర్ఎఫ్ వాహనాలు, బోట్లు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మహా

 

నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గవద్దని, వాళ్లకు ప్రొటోకాల్‌ వర్తించదని పోలీసులు గ్రహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రె్డి అన్నారు. పోలీసు పేరు వినిపిస్తే చాలు.. నేరగాళ్లు భయపడేలా ఉండాలన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయ్యిందని, ఒత్తిడి, పైరవీలకు తావులేకుండా పోలీసుశాఖలో పదోన్నతులు, బదిలీలు చేశామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసినవారూ కానిస్టేబుళ్లుగా వస్తున్నారని వ్యాఖ్యానించారు. సైబర్‌, డ్రగ్స్ పేరుతో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని, సైబర్‌క్రైమ్‌ నివారణ దిశగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. టీజీన్యాబ్‌కు డీజీపీ స్థాయి అధికారిని నియమించామని గుర్తుచేశారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు అంతముందు సీఎం రేవంత్రెడ్డి ఎన్టీఆర్ మార్గ్ వద్ద జెండా ఊపి ఎస్డీఆర్ఎఫ్ వాహనాలు, బోట్లను ప్రారంభించారు. అనంతరం హెచ్‌ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ స్టాల్ను సందర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలోని ఎస్డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తెలంగాణకు రావాలంటే డ్రగ్స్ రవాణాదారులు భయపడాలని సీఎం రేవంత్ ఉద్ఘాటించారు. డ్రగ్స్‌ విషవలయం గురించి పాఠశాలలు, కళాశాలల్లో చెప్పాలని సూచించారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారితో విద్యార్థులకు పాఠాలు చెప్పాలని తెలిపారు. పిల్లల భవిష్యత్తు గురించి పాఠశాల యాజమాన్యాలకు బాధ్యత ఉండాలని పేర్కొన్నారు.

 

ట్రాన్స్‌జెండర్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

 

విద్యాసంస్థల యాజమాన్యాలతో కమిషనర్లు సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డ్రగ్స్‌, గంజాయి కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలల్లోగా తీర్పులు వచ్చేలా చూస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను మానవీయ కోణంలో చూస్తామని, వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పారు. విధినిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

 

హోంగార్డుల వేతనాలు పెంపు

 

రాష్ట్రంలో 14 వేల మంది హోంగార్డులు ఉన్నారని, వారికి రోజుకు రూ.వెయ్యి వేతనం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వీక్లీ పరేడ్ అలవెన్స్‌ రూ.200 చేస్తామని తెలిపారు. మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. హోంగార్డులకు మెరుగైన వైద్యసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తామని, ఇప్పటికే యంగ్‌ఇండియా పోలీసు స్కూలుకు 50 ఎకరాలు కేటాయించామని గుర్తుచేశారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఏ అధికారి పిల్లలైనా ప్రవేశం పొందవచ్చని తెలిపారు.

 

కొందరు పోలీసుల తీరుతో అందరికీ చెడ్డపేరు

 

రాష్ట్రంలో మొత్తం 94 వేలమంది పోలీసులు ఉన్నారని, ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా మనవాళ్ల సాయం తీసుకుంటున్నారని సీఎం రేవంత్ తెలిపారు. పోలీసు ఉద్యోగం అనేది భావోద్వేగం, ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచే బాధ్యత అని వ్యాఖ్యానించారు. బాధితుల పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే నేరగాళ్లు, కబ్జారాయుళ్లకు అండగా ఉండటం కాదని హితవు పలికారు. కొందరు పోలీసుల తీరు వల్ల అందరికీ చెడ్డపేరు తెస్తోందని పేర్కొన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలని స్పష్టం చేశారు.

………