రైతులు మళ్ళీ ఢిల్లీ బాట పట్టారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాల ఆందోళన కేంద్రానికి ఎంత సవాల్ గా మారిందో తెలిసిందే. దెబ్బకు ప్రధాని మోడీ కూడా దిగొచ్చి పార్లమెంట్ వేదికగా ఉపసంహరణ ప్రకటన చేశారు. ఇపుడు మళ్ళీ కనీస మద్దతు ధర డిమాండ్‌తో “ఛలో ఢిల్లీకి” పిలుపునిచ్చిన పంజాబ్ రైతులు ఆందోళనలను ఆదివారానికి వాయిదా వేశారు. శనివారం కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. “వారు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అందుకే శనివారం వరకు వేచి చూస్తాం. మేము చర్చలు జరగాలనే కోరుకుంటున్నాం. ప్రభుత్వంతో సంఘర్షణ జరగాలని అనుకోవడం లేదు. మేము శాంతియుతంగానే వ్యవహరిస్తాం” అని రైతు సంఘాల నాయకుడు శర్వణ్ సింగ్ పంధేర్ అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శంభు సరిహద్దు ఉన్న రైతులు దిల్లీ ఛలోకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గ్రేటర్ నోయిడాలో ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నేరవేర్చాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారీగా రైతులు రావడం వల్ల గ్రేటర్ నోయిడాలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. 100 మంది రైతుల బృందం శాంతియుతంగా ఢిల్లీ వైపు కవాతు చేస్తుందని శంభు సరిహద్దు వద్ద ఉన్న రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న బారికేడ్లను బద్దలు కొట్టే ఉద్దేశం రైతులకు లేదని వెల్లడించారు. రైతులు ట్రాక్టర్లపై ఢిల్లీ వైపునకు వెళ్లడం వల్ల తమకు సమస్యగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు చెప్పాయని అన్నారు. అందుకే 100 మంది రైతుల బృందం శాంతియుతంగా ఢిల్లీ వైపు వెళుతుందని అన్నారు.
నిరసనలకు అనుమతి
“బారికేడ్లను బద్దలుకొట్టే ఉద్దేశం మాకు లేదు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలు తమకు అనుమతినిస్తాయని భావిస్తున్నాం. మాకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదు. మేము కూడా భారతీయులమే. మరీ ముఖ్యంగా రైతులం. ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఆపుతోంది? సరిహద్దుల వద్ద శాంతియుతంగా నిరసన తెలపడానికి ఎందుకు అనుమతించడం లేదు. కేంద్ర ప్రభుత్వం మా మాట వినడం లేదు. ” అని పంధేర్ మండిపడ్డారు.
ప్రధాన డిమాండ్ ధరలే
పంటలకు కనీస మద్దతు ధరే తమ ప్రధాన డిమాండ్ అని రైతు నాయకురాలు సుఖ్వీందర్ కౌర్ వ్యాఖ్యానించారు. “మాకు 12 డిమాండ్లు ఉన్నాయి. అందులో ప్రధాన డిమాండ్ పంటలకు కనీస మద్దతు ధర. పంజాబ్ ప్రభుత్వం ఎంఎస్పీ అందిస్తుందని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. పంజాబ్ సర్కార్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ” అని కౌర్ తెలిపారు. ఢిల్లీలో రైతుల శాంతియుత నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అలాగే రైతులు కేంద్రానికి చేస్తున్న డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ అగ్రనేత జైరాం రమేశ్ ఎక్స్లో పోస్టు చేశారు. రైతుల నిరసనలకు ఉపరాష్ట్రపతి జన్దీప్ ధన్‌ఖడ్ వంటి వ్యక్తుల పరోక్ష మద్దతు లభించిందని అన్నారు. అది రైతులకు బూస్టర్ డోస్ అని పేర్కొన్నారు.ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి ఏమి వాగ్దానం చేశారో దయచేసి నాకు చెప్పాలని అభ్యర్థిస్తున్నాను? ఎందుకు హామీలను నేరవేర్చలేదు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏం చేయాలి? గత ఏడాది రైతు ఉద్యమం జరిగింది. ఈ ఏడాది కూడా ఉద్యమం చేస్తున్నారు.’ అని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ధన్ఖడ్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ కాంగ్రెస్ కేంద్ర సర్కార్పై విమర్శలు గుప్పించింది.
‘రైతులకు అండగా మోడీసర్కార్’
వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ మోదీ సర్కార్ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. వరి, గోధుమ, జొన్న, సోయాబీన్ పంటలను మూడేళ్ల క్రితం కంటే 50 శాతం ఎక్కువకు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు లాభసాటి ధరలను ఇస్తోందని వ్యాఖ్యానించారు. రైతు నిరసనల నేపథ్యంలో శివరాజ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.