- – ఉదయం వెంకటాపురం, సాయంత్రం మల్లూరు
- – భయాందోళన చెందుతున్న జనం
- – అప్రమత్తంగా ఉండాలన్న అటవీ అధికారులు
ములుగు, మహా: ములుగు జిల్లాలో పులి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. గతంలో జిల్లాలో కలియదిరిగి వెళ్లగా మళ్లీ పులి అడుగుజాడలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటు ద్విచక్రవాహనదారులు, అటు వ్యవసాయ కూలీదారులు అందరూ భయం గుప్పిట్లో ఉన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక సమీపంలో ఉదయం అడుగులు కనిపించాయని ప్రచారం జరగడంతో అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. అదేవిధంగా మంగళవారం సాయంత్రం మంగపేట మండలం చుంచుపల్లి వద్ద గోదావరి దాటి మల్లూరు పరిసరాల్లో పులి అడుగులు కనిపించగా ఫారెస్టు ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. పులి ఎవరికైనా కనిపించినా, దాని ఆనవాళ్లు తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. చుంచుపల్లి, నీలాద్రి పేట, రాజుపేట, బాలన్నగూడేం, ప్రాజెక్టు నగర్, పూరేడుపల్లి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు చేయించారు. ఆయా గ్రామాల ప్రజలు పులిబారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని, ఎవరికైనా పులి కనిపిస్తే హాని చేయకుండా తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సూచించారు.