Mahaa Daily Exclusive

  అమెరికా చదువులపై భారత విద్యార్థుల అనాసక్తి..

Share

  •  38 శాతం తగ్గిన స్టూడెంట్ వీసాలు
  • అమెరికా విదేశాంగ శాఖ వెల్లడి
  • ఈ ఏడాది జనవరి- సెప్టెంబర్ మధ్య భారీ తగ్గుదల

 

మహా-

 

సాధారణంగా ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయులు.. ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే దేశం అమెరికా. అమెరికాకు ఏటా వెళ్లి చదువుకునే ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం భారీగా తగ్గిపోవడం గమనార్హం. ఈ 2024 ఏడాదిలోనే జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ నుంచి అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 38 శాతం తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ లెక్కలు చెబుతున్నాయి. భారతీయ విద్యార్థులకు అమెరికా జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాల్లో భారీగా తగ్గుదల నమోదైందని వెల్లడైంది. అయితే కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత.. అమెరికా ఇచ్చే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతీ సంవత్సరం వేలాది మంది భారతీయ విద్యార్థులు దేశం విడిచి అమెరికాకు వెళ్లి అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు అమెరికా ఇచ్చే ఎఫ్-1 స్టూడెంట్‌ వీసాలు 38 శాతం తగ్గినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ విడుదల చేసిన నెలవారీ నివేదికల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్య కేవలం 64,008 మంది భారతీయ విద్యార్థులు మాత్రమే ఎఫ్‌-1 వీసాలను పొందినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల కాలంలో ఈ ఎఫ్-1 వీసాల సంఖ్య 1,03,495గా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.