- నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ, మహా
తెలంగాణ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో 5010 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ జీవో నెంబర్ 46ను సవాలు చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ప్రతివాది అయిన తెలంగాణ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 46 జీవోను సవాలు చేస్తూ.. కొందరు అభ్యర్థులు మొదట హైకోర్టును ఆశ్రయించగా.. వారి వాదనలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు ఆగస్టు 28వ తేదీన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తున్న మాటూరి శ్రీకాంత్ సహా.. 74 మంది అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై.. జస్టిస్ అభయ్ ఎస్ ఓక, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే.. ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 46 జీవోపై తమ వైఖరి, పోస్టుల భర్తీ విషయంలో అవలంబించిన విధానంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. బాధితుల తరఫు న్యాయవాది ఆధిత్య సోండీ.. కేసు పరిష్కారమయ్యే వరకు ఖాళీగా ఉన్న 900 పోస్టుల భర్తీని నిలిపేయాలని వాధించారు. స్పందించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ వరకు వేచిచూడాలని స్పష్టం చేసింది. బాధితుల పక్షాన విచారణకు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా హాజరయ్యారు.