భారతీయుల రైలు ప్రయాణం మునుపెన్నడూ లేనంత సురక్షితంగా మారింది. గత దశాబ్ద కాలంగా అమలు చేస్తున్న ఆలోచనాత్మక కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయి. భారత్ కంటే ఎక్కువ మందిని రైల్వేల ద్వారా గమ్యస్థానాలకు చేర్చే సామర్థ్యం ఏ దేశానికీ లేదు. ఇది నిజంగా అభినందనీయమే. ఏటా లక్ష కోట్ల ప్యాసింజర్ కిలోమీటర్ల (పీకేఎం) దూరంతో, 685 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు రైల్వేలు చేరవేస్తున్నాయి. ఈ ఘనత అసమానమైనది. మనకంటే రైల్వే వ్యవస్థ విస్తృతి, జనాభా ఎక్కువగా ఉన్న పొరుగు దేశం చైనాలో కూడా భారతీయ రైల్వేల్లో ప్రయాణించేవారితో పోలిస్తే సగం మంది (300 కోట్ల) మాత్రమే ప్రయాణిస్తున్నారు. రైలు ప్రమాదాల సంఖ్య 2000-01లో 473 ఉండగా 2023-24 నాటికి 40కి తగ్గింది. భద్రతా ప్రమాణాలు ఎంత మెరుగయ్యాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. ట్రాకులను మెరుగుపరచడం, మానవరహిత లెవెల్ క్రాసింగ్‌లను తొలగించడం, వంతెనల సామర్థ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించడం, స్టేషన్లను డిజిటలైజ్ చేయడం లాంటి వాటిపై దృష్టి సారించి చేపట్టిన చర్యల కారణంగా ఈ పురోగతి సాధ్యమైంది. ప్రయాణీకుల సంఖ్యను, రైలు పట్టాల పొడవును పరిగణనలోనికి తీసుకున్నప్పుడు ఈ విజయాలు మరింత గొప్పగా అనిపిస్తాయి. రోజుకి సగటున రెండు కోట్ల మంది ప్రజలు 70,000 రూట్ కిలోమీటర్ల (ఆర్‌కేఎం) దూరం ప్రయాణిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సీజన్ లో ఈ సంఖ్య రోజుకి 3 కోట్లకు చేరుకుంటుంది. ఇది మరో ప్రపంచ రికార్డు. దేశం తన జనాభాలో సుమారు 2 శాతం మందిని రైల్వేల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఇది చైనాలో 0.58 శాతం కాగా అమెరికాలో 0.09 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రైలు ప్రయాణాలు ఆరంభమైననాటి నుంచి ఆదర్శవంతమైనదిగా భావిస్తున్న సున్నా ప్రమాదాల స్థాయిని ఇప్పటి వరకు ఏ పెద్ద వ్యవస్థా సాధించలేకపోయింది. భారతీయ రైల్వే వ్యవస్థ (ఐఆర్)లో నాలుగో వంతు మాత్రమే ఉండే ఆస్ట్రేలియా రైల్వేల్లో 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో రైలు పట్టాలు తప్పిన సంఘటనలు 52 జరిగాయి. ఇదే సమయంలో అమెరికా రైల్వేల్లో పట్టాలు తప్పిన ప్రమాదాలు 1,300 జరిగాయి. అమెరికా రైల్వేలు భారతీయ రైల్వే వ్యవస్థ కంటే రెండు రెట్లు ఎక్కువగా 2,60,000 ట్రాక్ కిలోమీటర్లు (టీకేఎం) ఉన్నాయి. 2,00,000 టీకేఎం ఉన్న యూరోపియన్ యూనియన్ వ్యవస్థలోనూ (ఐఆర్ కంటే 1.5 రెట్లు ఎక్కువ) 2022 ఏడాదికి 1568 ప్రమాదాలు జరిగాయి. సహదేశాల మాదిరిగానే ఐఆర్‌లోనూ పట్టాలు తప్పిన సంఘటనలు జరిగాయి. కానీ అవి 2022-23 వ్యవధిలో స్వల్ప సంఖ్యలో 137గా ఉన్నాయి. ఏళ్ల తరబడి మూల ధన వ్యయం ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉండటం, అధికార దుర్వినియోగం, రాజకీయాలు, అవినీతి తదితరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ లెక్కలు ఐఆర్ అద్భుత భద్రతా పనితీరుకు నిదర్శనం. దశాబ్దాల తరబడి సాగుతున్న ఇలాంటి అనైతిక కార్యకలాపాల వల్ల ఏర్పడిన మకిలిని ఒకటి లేదా రెండు పర్యాయాల పాటు గొప్ప ప్రభుత్వాలు నడిచినంత మాత్రాన తుడిచేయలేం. ఇతర దేశాల్లో సరకు రవాణా, ప్యాసింజర్ రైళ్ల కోసం వేర్వేరు ట్రాకులను ఉపయోగిస్తుంటే ఐఆర్ మాత్రం మిశ్రమ ట్రాఫిక్ పద్ధతిని వినియోగిస్తోంది. అంటే భారత్ లో జరిగే ఏ ప్రమాదం విషయంలోనూ రైల్వే ప్రయాణీకుల భద్రతతో ఏమాత్రం రాజీ పడట్లేదు అన్న విషయం అర్ధమవుతుంది. ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాన్ని తక్షణమే పరిష్కరించి, పట్టాలు తప్పని రైల్వే వ్యవస్థను రూపొందించడం అత్యంత ప్రాధాన్య అంశం. ఇది మానవ జోక్యాన్ని తగ్గించి వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేలా సాంకేతికపరమైన చొరవను తీసుకుంటుంది. ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ.. భద్రతకు సంబందించిన ప్రాజెక్టులపై 2023-24 లో లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకంటే ఎక్కువ ఖర్చు చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి. అంటే రైళ్లు, బ్రిడ్జిలు, ట్రాకులు, సిగ్నలింగ్ వ్యవస్థల నిర్వహణ మెరగుపరచడంతో పాటు.. ట్రాకులకు చేరువలో రోడ్డు భద్రతను పెంచేందుకు ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టవచ్చు. రైలు భద్రతకు ప్రామాణికంగా మిలియన్ ట్రైన్ కిలోమీటర్లకు అయ్యే ప్రమాదాల సంఖ్య (ఏపీఎంటీకే)ను పరిగణిస్తారు. ఇది 2000-01 నాటికి 0.65గా ఉంటే 2023-24 నాటికి 0.03 శాతానికి తగ్గింది. అత్యాధునిక ట్రాక్ నిర్వహణా యంత్రాలు, పునరుద్ధరణ యంత్రాలను ఉపయోగించి పట్టాలను మెరుగుపరచడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. పట్టాల్లో లోపాలను గుర్తించే సామర్ధ్యాన్ని మెరుగుపరచడం, రైలు వెల్డింగ్ వైఫల్యాల నియంత్రణ, మానవ తప్పిదాలను తగ్గించడానికి సాంకేతికతను వినియోగించడం సహా అదనపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఫలితాలను కొనసాగించడానికి, మరింత మెరుగుపరచడానికి, మరిన్ని సాంకేతిక పాద్ధతులను అనుసరించడం, అనుకున్న లక్ష్యాలను సాధించే విధంగా శిక్షణను ఇవ్వడం వంటి మిశ్రమ విధానాన్ని అవలంబిస్తున్నారు. ట్రాక్ నిర్వహణను మెరుగుపరిచే ఆధునిక ట్రాకు నిర్వహణా యంత్రాలు 2013-14లో 700 ఉంటే ఈ ఏడాది అవి 1,667కు పెరిగాయి. రైల్వే ఆస్తుల పరిరక్షణ విషయంలో మొత్తం అంతటా రైల్ గ్రైండింగ్ విధానాన్ని అమలుచేస్తున్నారు. విధ్యంసానికి పాల్పడటం, ట్రాకులను ట్యాంపరింగ్ చేయడం, ట్రాకులపై ప్రమాదాలను కలిగించే వస్తువులను ఉంచడం లాంటి రైల్వే కార్యకలాపాలకు తీవ్రమైన ప్రమాదం కలిగించే సమస్యలను ఆపేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు నిరంతర ట్రాక్ పెట్రోలింగ్ చేపడుతున్నారు. పొగమంచు అధికంగా ఉండే, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాల్లో లోకోపైలట్లు సురక్షితంగా రైలు నడిపేందుకు వీలుగా జీపీఎస్ ఆధారిత ఫాగ్ పాస్ పరికరాల వినియోగాన్ని పెంచారు. ఈ పరికరాలు 2014-15లో కేవలం 90 ఉంటే.. ప్రస్తుతం 21,742 ఉపయోగిస్తున్నారు. పైలెట్ ను నిరంతరం అప్రమత్తంగా ఉంచే విజిలెన్స్ కంట్రోల్ డివైజ్ (వీసీడీ)లు అన్ని లోకోమోటివ్ లలో అమర్చారు. వీటి సంఖ్య 2013-14 నాటికి 10,000 లోపు ఉంటే ఇప్పుడు అవి 16,021కి చేరుకున్నాయి. బ్రాడ్ గేజ్ మార్గాల్లో ఉన్న 6,637 స్టేషన్లలో 99శాతానికి పైగా స్టేషన్లలో ప్యానెల్ ఇంటర్ లాకింగ్, రూట్ రిలే ఇంటర్ లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ తదితర అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా లోకోపైలట్లు తమ డ్రైవింగ్ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి, ప్రమాదాలు ఎదురైన సమయంలో సరైన రీతిలో స్పందించేందుకు సిమ్యులేటర్ ఆధారిత శిక్షణ (క్షేత్ర అనుకరణ అనుభవం)ను అందిస్తున్నారు. అలాగే అనుభవజ్ఞులైన సిబ్బందికి అగ్నిమాపక శిక్షణ ఇస్తున్నారు. 2023-24లో మొత్తం 6 లక్షల మంది రైల్వే ఉద్యోగులు వివిధ రకాల శిక్షణ తీసుకున్నారు. . భారతీయ రైల్వేలు ప్రయాణీకుల భద్రతకే పరిమితం కాకుండా వన్య ప్రాణులు, పశువులను కూడా పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాయి. దీనికోసం 2024-25లో ట్రాకుల వెంట 6,433 కి.మీ.ల ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టు 2024 నాటికి 1,396 కిమీ మేర ఫెన్సింగ్ పూర్తి చేశారు. ఈ మార్గాల్లో రైళ్లు పశువులను ఢీకొనే ఘటనలు తగ్గాయి. ప్రమాదాలకు గురి కాని ఫీచర్లున్న సురక్షితమైన లింక్ హాఫ్ మన్ – బుష్ ఎల్‌హెచ్‌సీ బోగీలుగా మారుస్తున్నారు. ఈ రకమైన కోచ్‌లు ప్రమాదాలు జరిగినప్పుడు పట్టాలు తప్పే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా ప్రయాణీకులకు ప్రమాదాలు జరక్కుండా ఉంటుంది. గంటకు 160 కి.మీ. వేగంతో సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ ఎల్‌హెచ్‌బీ కోచులు తయారు చేశారు. వీటి తయారీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2013-14లో 2,467 కోచ్ లు తయారుచేయగా 2023-24 నాటికి ఇవి రెట్టింపు సంఖ్యలో 4,977 కు పెరిగాయి. ఈ కార్యక్రము ప్రశంసనీయమే అయినప్పటికీ ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యల్లో ప్రభుత్వం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు. ఇప్పటికే భారతీయ రైల్వేలు అత్యంత సురక్షిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందాయి. భవిష్యత్తులో రైలు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అనిల్ కుమార్ ఖండేల్‌వాల్
(ఐఆర్ఎస్ఈ – 1987) రిటైర్డ్ ఎక్స్-అఫీషియో సెక్రటరీ, భారత ప్రభుత్వం