Mahaa Daily Exclusive

  ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Share

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని, ఎవరికీ ఇబ్బంది లేకుండా వర్గీకరణ ప్రక్రియను చేపడతామన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ… చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ఖర్గే వెల్లడించారన్నారు.

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వడంలో తమ ప్రభుత్వం కీలక పాత్రను పోషించిందన్నారు. పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామని చెప్పారు.

 

ఎస్సీ వర్గీకరణపై కమిషన్ మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశముందన్నారు. ఈ నివేదిక ఆధారంగా ఇబ్బందులు లేకుండా వర్గీకరణ ప్రక్రియను చేపడతామన్నారు. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఓయూ వీసీగా తొలిసారి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించినట్లు చెప్పారు.

 

తన రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత తనదే అన్నారు. తెలంగాణ సమస్యలా మాదిగల వర్గీకరణ సమస్య జఠిలమైనదేనని… కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ (మాదిగలు) వాదనలో బలముందని, కాబట్టి మీకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.