Mahaa Daily Exclusive

  వారిద్దరు దొరలు.. మీరు బానిసలా.. బీఆర్ఎస్ ఎమ్మేల్యేలపై జాలి చూపిన సీతక్క..

Share

బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు వచ్చిన బాధలు ఎవరికీ రావద్దని ఏకంగా మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కావడం గమనార్హం.

 

తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా రాలేదని అందరూ అనుకుంటుండగా, కొందరు చేతులకు బేడీలు ధరించి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ వస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తరహాలో వస్తుంటే కేటీఆర్, హరీష్ రావులు కూడా అదే తరహాలో వస్తారంటూ.. అందరూ ఎదురుచూపుల్లో ఉండగా, ఆ ఇద్దరు మాత్రం సాఫీగా వచ్చారు. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బ్లాక్ షర్ట్స్ ధరించి రావడం విశేషం.

 

ఈ విషయంపై మీడియా కూడా అంతగా దృష్టి సారించని సమయంలో మంత్రి సీతక్క అసెంబ్లీ లాబీ వద్దకు వచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. కేటీఆర్, హరీష్ రావులు తమ చేతులకు బేడీలు వేసుకోకుండా, కేవలం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు బేడీలు వేయించి నిరసన వ్యక్తం చేయడం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఈ వ్యవహారంతోనే కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడిందన్నారు. నిరసన వ్యక్తం చేయడంలోనూ బీఆర్ఎస్ నేతలో సమానత్వం లేదని, తమ దురహంకారాన్ని కేటీఆర్, హరీష్ లు బయట పెట్టారన్నారు.

 

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కనీసం 10 సార్లు బేడీలు వేశారని, అప్పుడు అధికారుల మీద చర్యలు లేవన్నారు. ప్రస్తుతం రైతుకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి చర్యలు కూడా తీసుకున్నారన్నారు. ఆమాత్రం కూడా తెలియకుండా బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకు తెగ తాపత్రయ పడుతుందంటూ మంత్రి సీతక్క అన్నారు. ఇలా మంత్రి సీతక్క చెప్పగానే, మీడియా లాబీలోని ప్రతినిధులు ఔను నిజమే కదా, మనం గమనించలేక పోయామేనంటూ చర్చించుకోవడం విశేషం. మొత్తం మీద సీతక్క చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.