Mahaa Daily Exclusive

  కేటీఆర్ అరెస్ట్ కు రెడీ..?

Share

మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ గురించి ఇదిగో కేసు, అదిగో అరెస్ట్ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ అరెస్ట్ సంగతి ఏమో కానీ, ఒకవేళ అదే జరిగితే ప్లాన్ – బీ కూడా రెడీగా ఉందట. ఈ మాటలు అంటున్నది నెటిజన్స్ కానే కాదు.. ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మేల్యేనే. కేటీఆర్ అరెస్ట్ జరిగితే నెక్స్ట్ అదే జరుగుద్ది అంటున్నారు ఆ ఎమ్మేల్యే.

 

కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఫార్ములా ఈ – రేసింగ్ ఒకటి. దీని వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనుమానాలు తావిచ్చాయి. ఏసీబీ దర్యాప్తు కూడ జరుగుతోంది. అప్పటి మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్‌ను పర్మిషన్ అడిగింది ఏసీబీ. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. 18 రోజుల వ్యవధిలో సంబంధం లేని హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకపోవడం, రెండు దఫాలుగా రూ.46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది ఆరోపణ. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని చెప్పవచ్చు.

 

ఇటీవల ఫార్ములా ఈ – రేసింగ్ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో స్వయానా కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. నేను జైలుకు వెళ్లేందుకు రెడీ. మీరు అరెస్ట్ చేస్తే చేయండి, డైలీ జిమ్ ప్రాక్టీస్ చేసి స్టిఫ్ గా బయటకు వస్తానంటూ చెప్పకనే చెప్పారు. అయితే ఇక్కడే బీఆర్ఎస్ పెద్ద ప్లాన్ వేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

 

కేటీఆర్ జైలుకు వెళితే చాలు.. సానుభూతి వస్తుందన్నది ఆ ఆలోచన. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జైలుకు వెళ్ళిన కవిత కూడా బెయిల్ పై బయటకు రావడంతో కేటీఆర్ జైలుకు వెళ్లినా పెద్దగా ప్రభావం చూపదన్నది పొలిటికల్ టాక్. అందుకే కాబోలు ఇప్పటికే నేను రెడీ అంటూ కేటీఆర్ చెప్పకనే చెప్పారు. అయితే ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, ఫార్ములా ఈ – రేసింగ్ లో అక్రమాల వల్లే కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని కాంగ్రెస్ వాదిస్తోంది.

 

ఇలా కేటీఆర్ అరెస్ట్ అంటూ వార్తలు గుప్పుమన్న వెంటనే, బీఆర్ఎస్ ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతి జరిగిందా లేదా అన్నది పక్కన పెట్టి ఏకంగా రాష్ట్రం అగ్ని గుండమేనంటూ బెదిరింపులకు దిగారు. అంటే ఎమ్మేల్యే మాటలను బట్టి కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు జరిగినా, బీఆర్ఎస్ ప్లాన్ – బీ అమలుకు సిద్దమైంద ని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పూర్తి స్థాయి ప్లాన్ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

అరెస్ట్ మాట దేవుడెరుగు కానీ, అప్పుడే రాష్ట్రం అగ్ని గుండంలా భగభగ మండడం ఏమో కానీ, ముందు అవినీతి గురించి మాట్లాడండి ఎమ్మేల్యే గారూ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కేటీఆర్ అరెస్ట్ జరిగిన వెంటనే, కేసీఆర్ కూడా ప్రజల్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ బూచిగా చూపి, వచ్చినా ఇక్కడ అంత లేదు.. పదేళ్లు చూపించిన నరకం చాలదా.. ఇంకెన్నాళ్లు అంటూ కాంగ్రెస్ రివర్స్ పంచ్ తో సిద్దమైన పరిస్థితి.

 

మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ కోసం బీఆర్ఎస్ ఓ వైపు తహతహలాడుతూ.. మరోవైపు వార్నింగ్ లు కూడా ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదన్నది పొలిటికల్ అనలిస్టుల వాదన. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా.. లేదా అన్నది మున్ముందు కాలంలో తెలియాల్సి ఉందన్నమాట.