Mahaa Daily Exclusive

  సంక్రాంతి సంబరాలకు తెలంగాణ సర్కార్ సరికొత్త పథకాలతో సందడి..

Share

సంక్రాంతి వస్తోంది. సంబరాలు తెస్తోంది. ఎటు చూసినా గ్రామాలు సందడి సందడిగా కనిపిస్తాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందమయ క్షణాల్లో ఉంటారు. అటువంటి సంక్రాంతి సంబరాలకు తెలంగాణ సర్కార్ సరికొత్త పథకాలతో సందడి చేయనుంది. సంక్రాంతి అంటేనే సందడి.. సంబరం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి, పేదల కుటుంబాల్లో కూడా ఆ సంబరాన్ని తెచ్చేందుకు పెద్ద ప్లాన్ వేశారు.

 

తెలంగాణ సర్కార్ ఏడాది పాలనలో ఏం చేసిందంటే.. చాలానే చేసిందంటున్నారు ప్రజలు. అందుకు ఉదాహరణే మొన్న జరిగిన ప్రజా విజయోత్సవాలు. ఏడాది కాలంలో మహిళలకు ఫ్రీ బస్, సుమారు 55 వేల ఉద్యోగాలు, రుణమాఫీ, గృహ జ్యోతి, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, గురుకులం విద్యార్థులకు మెనూ మార్పు, మూసీ ప్రక్షాళన, ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, సింగరేణి కార్మికులకు బోనస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు.

 

సంక్రాంతికి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వినూత్న పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అందులో ప్రధానంగా భూమి లేని పేదలకు ఆర్థిక చేయూత అందించేందుకు సీఎం రేవంత్ సర్కార్, దేశంలో ఎక్కడా లేని విధంగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. భూమి ఉంటే సాగుతో ఆదాయం అందుతుంది. అదే లేని వారి పరిస్థితి ఎట్లా అంటూ ఆలోచించిన ప్రభుత్వం, వారికి ఏడాదికి రూ. 12 వేలు అందించేందుకు సిద్దమవుతోంది. డిసెంబర్ 28న ఈ పథకానికి తొలి ఆడగు పడనుంది.

 

అలాగే ఏ పథకం వర్తించాలన్నా రేషన్ కార్డు అవసరం. అర్హత ఉండి రేషన్ కార్డు లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా ఇటువంటి వారికి మాత్రం రేషన్ కార్డు లేదన్నది వాస్తవం. అందుకే సంక్రాంతి పండుగ తర్వాత సుమారు 30 లక్షలకు పైగానే రేషన్ కార్డులను ప్రభుత్వం అందించనుంది. దీనితో ఎన్నో పేద కుటుంబాలకు మేలు జరగనుంది. ఇటీవల నిర్వహించిన కుటుంబ సర్వే ద్వారా, రేషన్ కార్డు లేకుండా ఇబ్బందులకు గురవుతున్న వారి పరిస్థితి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

అంతేకాదు సంక్రాంతి అంటేనే పాడిపంటల పండుగని కూడా చెబుతారు. అటువంటి పండుగకు రైతన్నలలో చిరునవ్వులు చిందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఏడాదిలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం, రైతు బంధు కూడా విడుదల చేయడం రైతన్నలకు అసలు సంక్రాంతి అంటే ఇదే అనే తరహాలో పథకం వరంగా మారనుంది.

 

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాటలు కాదు పాలన చేతల్లో చూపిస్తామంటూ ప్రకటించారు. గత పాలకులు దోచుకున్నారు.. దాచుకున్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో వాటికి చోటు లేదు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయమంటూ సీఎం చెప్పారు. సేమ్ టు సేమ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా పాలనకు కట్టుబడి సంక్రాంతికి వరాల జల్లు కురిపిస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.