Mahaa Daily Exclusive

  థియేటర్‌లోకి మళ్లీ వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’..! కానీ ఈసారి సినిమాగా కాదు..

Share

రాజమౌళి కెరీర్ ‘బాహుబలి’తో చాలా మారిపోయింది. ఈ సినిమాతోనే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అందరి ఊహలకు మించి రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీ స్టారర్‌ను తెరకెక్కించారు జక్కన్న. మరి ఈ సినిమా వెనుక ఎంత కష్టముందో అందరికీ తెలియడం కోసం ‘ఆర్ఆర్ఆర్ బియాండ్ అండ్ బిహైండ్’ అనే డాక్యుమెంటరీ రాబోతోంది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. త్వరలోనే ఈ డాక్యుమెంటరీ థియేటర్లలో కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యింది.

 

చాలా భయపడ్డాను

 

‘ఆర్ఆర్ఆర్’లో ట్రెయిన్ సీన్ ఎలా షూట్ చేశారో చూపించడంతో ‘ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ (RRR Behind And Beyond) ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘‘12 సినిమాలు చేశాను. ఇలా ఎప్పుడూ భయపడలేదు. ఇలాంటి ఒక ఐడియా వచ్చింది. దానిని తెరపైకి తీసుకురావాలని అనుకున్నాను’’ అంటూ ఈ సినిమా గురించి రాజమౌళి (Rajamouli) చెప్పుకొచ్చారు. ‘‘ఇలాంటిది ఒకటి చేయగలమని అస్సలు ఊహించలేదు’’ అని ఎన్‌టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) చెప్పుకొచ్చారు. తన బెస్ట్ ఫ్రెండ్ తారక్‌తో కలిసి నటించడం బాగుందని సంతోషం వ్యక్తం చేశాడు రామ్ చరణ్. సెట్‌కు రావడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించేదని గుర్తుచేసుకున్నాడు ఎన్‌టీఆర్. అయితే ఈ ఇద్దరు హీరోలను ఒకేచోట చేర్చడం కోసం చాలా కష్టపడ్డామని రాజమౌళి అన్నారు.

 

నాటు కోసం కష్టాలు

 

తన సినిమాలతో తాను ఎలాంటి మెసేజ్‌లు ఇవ్వనని తేల్చిచెప్పారు జక్కన్న. ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా చాలా షాకయ్యారని కీరవాణి గుర్తుచేసుకున్నారు. నాటు అంటే ఏంటని ఆశ్చర్యపోయారని అన్నారు. ఆపై ‘నాటు నాటు’ కోసం ఇద్దరు హీరోలు ఎంత కష్టపడ్డారో ఈ ట్రైలర్‌లో చూపించారు మేకర్స్. ‘‘ఫైట్ లాగా ఉండాలి, డ్యాన్స్ లాగా ఉండాలి, కథ జరగాలి’’ అంటూ ఈ పాట కొరియోగ్రాఫీ కోసం ఎంత కష్టపడ్డారో తెలిపారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. రాజమౌళి ఒక క్రాఫ్ట్స్‌మ్యాన్ అని, ఇంతకు ముందు ప్రేక్షకులు చూడనిది చూపించాలని తమకు చెప్పారని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ బయటపెట్టింది.

 

కెరీర్‌లోనే స్పెషల్

 

ఎన్‌టీఆర్‌ను చూస్తున్నప్పుడు తనకు ఈర్ష్య కలిగిందని చరణ్ బయటపెట్టాడు. ‘‘నేను ఒక్క టైగర్‌తో కాదు రెండు టైగర్స్‌తో షూటింగ్ చేశాను’’ అంటూ చరణ్, తారక్ ఇద్దరూ తనకు సమానమే అని నిరూపించారు రాజమౌళి. ఆస్కార్ రావడం ‘ఆర్ఆర్ఆర్’కు మంచి ముగింపులాగా అనిపించిందని తెలిపారు. ఈ సినిమా తమ కెరీర్‌లో స్పెషల్ అని చరణ్, తారక్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది అనుకుంటే డిసెంబర్ 20న థియేటర్లలోనే విడుదల కానుందని చెప్పి మేకర్స్ షాకిచ్చారు. కానీ కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ డాక్యుమెంటరీ విడుదల కానుందని క్లారిటీ ఇచ్చారు.