Mahaa Daily Exclusive

  ఔటర్ లీజుపై ‘సిట్’.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

Share

ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఫీజు వసూలును మహారాష్ట్రకు చెందిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కి 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చింది గత ప్రభుత్వం. ఈ నిర్ణయంపై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావు విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక నిర్వహణపై అసెంబ్లీలో గురువారం చర్చ జరుగుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హరీశ్‌ రావు మధ్య వాగ్వాదం జరిగింది.

 

గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకున్నదని, ఔటర్ రోడ్డును టెండర్ ద్వారా ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇచ్చిందని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. దీన్ని హరీశ్‌ రావు ప్రస్తావిస్తూ అవసరమైతే టెండర్‌ను రద్దు చేసుకోవచ్చంటూ సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య వాదనలను నిశితంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్‌ రావు విజ్ఞప్తి మేరకు ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

 

హరీశ్ రావు వాదన ఇదే!

 

సీఎం రేవంత్ ప్రకటనతో అవాక్కయిన హరీశ్‌ రావు జోక్యం చేసుకుని, టెండర్‌ను రద్దు చేయాలనే తాను కోరానని, కానీ దర్యాప్తు జరపాలని కోరలేదని, సభను సీఎం తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుని, టెండర్లను రద్దు చేయాలనే ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకోడానికి ముందు దర్యాప్తు జరిపి నిర్ధారణకు రావడం తప్పనిసరి షరతు అని స్పష్టం చేశారు. సీఎం సభను తప్పుదోవ పట్టించలేదని, పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారని తెలిపారు. దీంతో హరీశ్ రావు ఏం మాట్లాడలేని స్థితిలో పడిపోయారు.

 

టెండర్ ప్రక్రియపై నిలదీసిన సీఎం

ప్రకటన చేస్తున్న సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ, నిజానికి హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది, దానికి తగిన మౌలిక సౌకర్యాలను అందించింది గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాలు నగర ముఖచిత్రాన్నే మార్చేశాయని, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించేలా దోహదపడ్డాయన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాలతో నగర, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. మెట్రో రైలు, ఫార్మా కంపెనీల ఏర్పాటు, శాంతిభద్రతల నిర్వహణ, మతసామరస్యం, మౌలిక సౌకర్యాల పెంపు లాంటివన్నీ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో స్థానం లభించేలా చేశాయన్నారు.

 

ప్రస్తుతం హైదరాబాద్‌ ఒక విశ్వ నగరంగా గుర్తింపు రావడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే కారణమని వివరించారు. కానీ, గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు కేసీఆర్ ప్రభుత్వం ఓఆర్ఆర్ టోల్ వసూలు బాధ్యతలను ఓ ప్రైవేట్ కంపెనీకి 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిందని ప్రస్తావించారు. అప్పట్లోనే రాష్ట్రంలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగిందన్నారు. నిజానికి ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలోనే రేవంత్‌ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. గత ప్రభుత్వం అప్పట్లో వేధించిందని పలుమార్లు మీడియాతో వ్యాఖ్యానించారు. టెండర్ ఒప్పందం వ్యవహారంలో అధికారికంగా వివరాలు ఇవ్వకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించారు.

 

సమాచార హక్కు చట్టం కింద వివరాలను రాబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 28న హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలితో ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంపై పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. కనీసమైన ధరను కూడా ఫిక్స్ చేయకుండా టెండర్ కట్టబెట్టడంపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. టెండర్ ఖరారు చేసినప్పటి నుంచి హాట్ టాపిక్‌గా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు ‘సిట్’ పరిధిలోకి వెళ్తుండడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది