Mahaa Daily Exclusive

  317 జీవోపై మండలిలో హాట్ హాట్ చర్చ..!

Share

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 317 జీవోపై మండలిలో హాట్ హాట్ చర్చ సాగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మిగతా సభ్యులపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆనాడు రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈ జీవోను తేవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు. దీని ద్వారా శాశ్వత ఉద్యోగులుగా ఎక్కడిక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

 

ఈ సమస్య మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందన్నారు. కేబినెట్ సభ కమిటీ ద్వారా కొంత పరిష్కారం కొనుగొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ జీవోపై ఉద్యోగుల్లో భయం పూర్తిగా పోలేదన్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాతే అసలు సమస్య మొదలైందన్నారు.

 

దీనిపై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. జీవోపై విమర్శలు చేసినవారంతా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారన్నారు. ఇప్పటికీ సమస్యలు చెబితే ఎలా? సొల్యూషన్ కావాలన్నారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలపై మంత్రి శ్రీధర్‌బాబు వివరణ ఇచ్చారు.

 

విభజన శాస్త్రీయంగా జరిగిందా, అశాస్త్రీయంగా జరిగిందా? అనేది పక్కనబెడితే స్థానికత గురించి పోరాటం చేశామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. తద్వారా రాష్ట్రం ఏర్పడిన విషయం అందిరికీ తెలుసన్నారు. తీసుకొచ్చిన జీవో కారణంగా ఇబ్బందిపడేవారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చామన్నారు.

 

ఈ అంశానికి సంబంధించి కేబినెట్ సభ కమిటీ ఏర్పాటు చేశారన్నారు మంత్రి. ఆ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు కమిటీ భేటీ అయ్యిందన్నారు. 30 వేల అప్లికేషన్లు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. వేలాది మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ 12 సార్లు భేటీ అయ్యిందన్నారు. ఈ సమస్యను పుల్ స్టాప్ పెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

 

2018లో 371 డీ పరిగణనలోకి తీసుకుంటే ఈ సమస్య ఉండేది కాదన్నారు. స్థానికతను కాపాడే క్రమంలో సీనియార్టీని పోకుండా జోనల్ వైడ్‌గా అభిప్రాయాలు తెలపాలని కోరారు. స్థానికత విషయంలో చాలా కేసులు న్యాయస్థానంలో పెండింగ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు మంత్రి. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాదులతోనూ మాట్లాడామన్నారు.

 

ఒకానొక సందర్భంలో ఈ జీవోలు రద్దు చేయాలని ప్రభుత్వం భావించిందని గుర్తు చేశారు సదరు మంత్రి. ఏ మాత్రం అవకాశమున్నా డిసెంబర్ 30 లోగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. న్యాయ నిపుణులు మాత్రం పీవో మార్పు జరగాలన్నారు. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

 

ఆనాడు బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు పెద్ద సమస్య మారిందన్నారు మంత్రి. స్థానికత విషయంలో ఏ మాత్రం ఆలోచన చేయలేదన్నారు. దీనివల్ల అనేక మంది ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని వివరించారు. అందరితో సంప్రదింపులు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారం కేవలం నాలుగు జిల్లాల్లో ఎక్కువగా ఉండగా, మిగతా జిల్లాల్లోనూ ఉందన్నారు. ఈ క్రమంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు.

 

ఆనాడే స్థానికతను కాపాడేలా యూనిక్ సిస్టమ్ క్రియేట్ చేసుంటే, ఈనాడు సమస్యలు వచ్చేవి కావన్నారు. రేషనల్‌గా ఏదీ చేయలేదన్నారు. ఈ విషయంలో ఎవరిపైనా విమర్శలు చేయలేదన్నారు. ఆనాడు రాజకీయ వ్యూహంతో తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణ శాసనమైందంటూ పేపర్లు రాసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.