Mahaa Daily Exclusive

  కమలంలో కీలక మార్పులు.. నడ్డా ప్లేస్‌లో కిషన్‌రెడ్డి..?

Share

బీజేపీలో కీలక మార్పులు జరగనున్నాయా? పార్టీ జాతీయ కొత్త అధ్యక్షుడి కోసం ఎంపిక మొదలైందా? బీజేపీ అంటే కేవలం నార్తిండియా పార్టీగా ముద్ర పడిపోయిందా? దాన్ని తొలగించే పనిలో పడిందా? వచ్చే ఎన్నికలకు బలపడాలంటే సౌత్‌కి అధ్యక్ష పీఠం ఇవ్వాల్సిందేనని కొందరు నేతలు హైకమాండ్‌ దృష్టికి తెచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

ఉత్తరాధిలో కమలం పార్టీకి ఈసారి ఎదురీత తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తు న్నాయి. దీని నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ హైకమాండ్. సౌత్‌లో నేతకు అధ్యక్ష పీఠం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే దక్షిణాది నుంచి వెంకయ్యనాయడు, బంగారు లక్ష్మణ్ మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టారు.

 

ఇక తమిళనాడు, కేరళ వైపు చూసినప్పటికీ అనుభవమున్న నేతలు పెద్దగా లేరు. దీంతో బీజేపీ పెద్దల దృష్టి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై పడింది. ఆయనైతే ఎలా వుంటుందనేది ఆ పార్టీ చర్చ జరిగింది. దశాబ్దాల తరబడి ఆయన పార్టీని నమ్ముకోవడం ఒకటైతే, విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఏనాడూ పార్టీ లైన్ దాటిన సందర్భం లేదు. మోదీ కేబినెట్‌లో మంత్రి పదవులు చేపట్టారు.

 

కిషన్‌రెడ్డికు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇస్తే.. సౌత్‌లో పార్టీకి ఊపు వస్తుందని భావిస్తున్నారట. దీనికితోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని చెబుతున్నారు. ఈ చర్చంతా 20 రోజుల కిందట ఢిల్లీలో జరిగింది. దీనిపై వారం కిందట కిషన్‌రెడ్డితో జేపీ నడ్డా భేటీ కావడం వెనుక ఇందులో భాగమేనని అంటున్నారు.

 

అంతా అనుకున్నట్లుగా జరిగితే మరో రెండు నెలల్లో కాబోయే జాతీయ అధ్యక్షుడిపై క్లారిటీ రావచ్చని అంటున్నారు. కిషన్‌రెడ్డి అధ్యక్ష పదవి విషయంలో ఆర్ఎస్‌ఎస్ సానుకూలంగా ఉందన్న సంకేతాలు లేకపోలేదు.

 

కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి చేపడితే తెలంగాణ పరిస్థితి ఏంటనే దానిపై నేతల మధ్య చర్చ జరిగిందట. కేసీఆర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నిలబెడితే బాగుంటుందనే ఆలోచన చేస్తోందట. పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం ప్రతిపక్షంగానైనా ఎదిగేందుకు ఛాన్స్ ఉంటుందని లెక్కలు వేసుకుంటోందట కమలం పార్టీ. రాబోయే రోజుల్లో కమలం పార్టీలో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.