Mahaa Daily Exclusive

  ఏపీ కేబినెట్ భేటీలో మొత్తం 21 అంశాలపై చర్చ..

Share

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో నిర్వహించారు. ఇందులో.. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలతో పాటు కూటమి పదవులు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో ఆరుగురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వారిని సున్నితంగా మందలించారు. ఈ విషయాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి.. కేబినేట్ నిర్ణయాల్ని వెల్లడించారు.

 

ఏపీ కేబినేట్ నిర్ణయాలు

 

కేబినెట్ భేటీలో మొత్తం 21 అంశాలపై చర్చ జరిగింది. వాటిలో జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణం గురించి కేబినేట్ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో పాటే.. సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై చర్చించిన మంత్రులు.. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రతిపాదనలకు ఆమోదించారు. ఈ నిర్మాణాల్ని యుద్ధప్రాతిపదికన నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కేవలం మూడేళ్లల్లోనే రాజధానికి రూపురేఖలు ఇవ్వాలని, పనుల్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. రాజాధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణపై చర్చించిన మంత్రిమండలి.. హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్లూ ద్వారా రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు అనుమతి మంజూరు చేసింది. అదే విధంగా.. రాజధానిలో నిర్మించ తలపెట్టిన 45 పనులకు రూ. 33 వేల కోట్ల నిధులు వెచ్చించేందుకు సీఆర్డీఏకు ఏపీ కేబినేట్ అనుమతించింది.

 

రాష్ట్రంలో పరిశుభ్రమైన తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన మంత్రులు.. అప్పట్లో ఏకంగా రూ.26,804 కోట్లకు ప్రతిపాదనలు పంపి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తించింది. దేశంలోని మిగతా చిన్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా పనులు అయ్యాయన్న ఏపీ ప్రభుత్వం.. నిలిచిపోయిన పనులను తిరిగి చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. బుడమేరు సహా పది జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌, రూ.50 వేల వరకూ ఉన్న రుణాలపై స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోద ముద్ర పడింది.

 

ధాన్యం కొనుగోలు కోసం ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా రూ.1000 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం లభించింది. ఈ నిధులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు బదిలీ చేసేలా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృషి విజ్ఞాన కేంద్రానికి 50.20 ఎకరాల బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

 

వీటితో పాటుగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ఎడమ కాలువ రీటెండర్ పిలిచెందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రెండో దశలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు, క్లీన్ ఎనర్జీ కోసం ఎన్‌టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 475 జూనియర్ కళాశాలలో 2024 డిసెంబర్ నుంచి మధ్యాహ్నం భోజనం అందించేేందుకు ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. రూ.32కోట్ల వ్యయంతో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం లభించింది.

 

డేంజర్ జోన్లో ఆరుగురు మంత్రులు

 

మంత్రుల పనితీరుపైగా పరిశీలన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఆరుగురు మంత్రుల పనితీరు ఏ మాత్రం బాగోలేదని వ్యాఖ్యానించారు. వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోలేదని ఆగ్రహించారంట. ఇకపైన కూడా మార్పు రాదని నాకు బాగా తెలుసు అని చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకారంటున్నారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ఇక చెప్పడం, వార్నింగ్‌లు ఇవ్వడం ఏమీ ఉండదు పదవి నుంచి తొలగించడమే అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఆరుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడం పక్కా అని దాదాపు తేలిపోయింది. ఈ కీలక పరిణామం వచ్చే ఏడాది, అందులోనూ సంక్రాంతి తర్వాత ఉండే అవకాశాలే మెండుగానే కనిపిస్తున్నాయి.

 

రాయలసీమ నుంచి ఇద్దరు, ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, కోస్తా నుంచి ముగ్గురి విషయంలో మొత్తం ఆరుగురు మంత్రులపై గుర్రుగా చంద్రబాబు ఉన్నారు. వీరికి ఇచ్చిన శాఖల పరంగా న్యాయం చేయలేకపోవడం, కనీసం శాఖలపై పట్టు పెంచుకోవడానికి కూడా సాహసం చేయకపోవడం, ఇక లేనిపోని విషయాల్లో ఆ మంత్రులు, వారి కుటుంబ సభ్యులు తలదూర్చి వార్తల్లో నిలవడం ఇలా ఒకట్రెండు కాదు లెక్కలేనన్ని ఆరోపణలు వారిపై ఉన్నాయి. సంక్రాంతి తర్వాత వారందర్నీ పక్కనెట్టినా, లేదంటే ఇంకో ఆర్నెళ్లు సమయం ఇచ్చినా ఇవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.