Mahaa Daily Exclusive

  ఇందులో అవినీతి జరిగిందంట… దానిపై ఏసీబీ కేసంట!: కేటీఆర్ ఫైర్..

Share

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తనపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో… బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో కుంభ కోణం జరిగిందని లీకులు ఇస్తున్నారని, దమ్ముంటే కార్ రేసింగ్ అంశంపై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.

 

2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ రేసుకు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారని వివరించారు. కార్ రేసింగ్ ఈవెంట్ క్రెడిట్ పొందేందుకు బీజేపీ కూడా ప్రయత్నించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకారంతోనే రేసింగ్ ఈవెంట్ సాధ్యమైందని కిషన్ రెడ్డి చెప్పుకున్నారని, ఈ కార్ రేసింగ్ ను ముంబైలో జరపాలని నితిన్ గడ్కరీ ప్రయత్నించారని వివరించారు.

 

దేశంలోని చాలామంది ప్రముఖులు నాడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్ రేసింగ్ ను ప్రశంసించారని తెలిపారు. దీనిపై సభలో చర్చ జరపాలని తాము డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం నుంచి స్పందన లేదని అన్నారు. ఇప్పటికీ అడుగుతున్నాం… తప్పు జరిగిందని నిరూపించగలరా? అని మరోసారి సవాల్ విసిరారు. ఇందులో ఏమీ లేదని ప్రభుత్వానికి కూడా తెలుసని, ఎలాంటి అక్రమాలు జరగకపోయినా శాడిస్ట్ మెంటాలిటీతోనే కేసులు పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ సర్వనాశనం అవుతుందని, హైదరాబాద్ లో ఈవెంట్లు జరపడానికి ఇంకెవరూ ముందుకురారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

“హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహించాం. నేను ఏ తప్పు చేయలేదు… భయపడే ప్రసక్తేలేదు. న్యాయపరంగా ఏంచేయాలో అదే చేస్తాం. ఈ వ్యవహారంలో గవర్నర్ కు ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించాలనుకోవడంలేదు. గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయాలో నాకు తెలియదు. దొంగమాటలు చెప్పి ఆయనను ఒప్పించారేమో!

 

కానీ, ప్రభుత్వం అనేక అంశాలను దాచిపెడుతూ వస్తోంది. హెచ్ఎండీఏ నుంచి రూ.55 కోట్లు తీసుకున్నట్టు ఈవెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. లైసెన్స్ ఫీజు రూ.74 లక్షలు వాపసు పంపుతూ ఎఫ్ఎంఎస్ఏ వర్గాలు లేఖ రాశాయి. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందో వివరణ ఇవ్వాలి. ఎఫ్-1 రేసుల నిర్వహణకు దేశవ్యాప్త పోటీ ఉంది.

 

హైదరాబాదులో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. 2001లోనే చంద్రబాబు ఫార్ములా-1 రేసింగ్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వహించాలని ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు. రేస్ ట్రాక్ కోసం గోపన్ పల్లిలో భూసేకరణ కూడా జరిగింది. గోపన్ పల్లిలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా 15 ఎకరాల భూమి ఉంది.

 

అయితే, మా ప్రయత్నాలు ఫలించి బీఆర్ఎస్ హయంలో రేసింగ్ ఈవెంట్ సాకారమైంది. రూ.150 కోట్లు ఖర్చు చేస్తే రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ కార్ రేసింగ్ తో జీహెచ్ఎంసీకి ఎంతో ప్రచారం, ఆదాయం చేకూరింది. కానీ ప్రమోటర్స్ గ్రీన్ కో వాళ్లు తమకు పెట్టుబడికి తగిన ఆదాయం రాలేదన్నారు. వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్ గా మార్చాలనేది మా ప్రయత్నం. రేసింగ్ ఈవెంట్ నిర్వహించడం ద్వారా ఈవీ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించాలని ప్రణాళికలు రూపొందించాం.

 

నష్టం వచ్చిందని ప్రమోటర్లు అనడంతో మేం డబ్బు చెల్లించాం. ప్రమోటర్లకు ఆ డబ్బు చెల్లించడం వల్లే రేసింగ్ ఈవెంట్ ఇక్కడ జరిగింది. చాలా నగరాల్లో కాంట్రాక్టు వివాదాలు సహజంగానే జరుగుతుంటాయి. రేసింగ్ ఈవెంట్ ప్రమోటర్లు 2023 డిసెంబరు 13న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. వచ్చే మూడేళ్లు కూడా హైదరాబాదులోనే రేసింగ్ ఈవెంట్ నిర్వహిస్తామని ప్రమోటర్లు లేఖ కూడా రాశారు. మరోసారి ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ నిర్వహణకు కొత్త సీఎం కూడా సుముఖంగా ఉన్నారని వారు తమ లేఖలో పేర్కొన్నారు.

 

అతి పెద్ద జోక్ ఏంటంటే… దీనిపై ఏసీబీ కేసంట… ఇందులో అవినీతి ఎక్కడుందో చెప్పండి? రూ.55 కోట్లు మనం కట్టాం. కట్టిన డబ్బులు తమకు ముట్టాయని వాళ్లు చెబుతున్నారు. లైసెన్స్ డబ్బులు వాపసు ఇస్తున్నామని వాళ్లే చెబుతున్నారు. కానీ ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి, ఏదో నేరం జరిగిందని బట్ట కాల్చి మీద వేసే ఒక లత్కోర్ ప్రయత్నం ఇది. మమ్మల్ని గెలిపించి ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజలకు ఈ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది.

 

హెచ్ఎండీఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉంది. ఆ బ్యాంకు నుంచి నేరుగా డబ్బులు బదిలీ అయ్యాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది జాతీయ బ్యాంకు… అదేమీ చిన్నాచితకా బ్యాంకు కాదు. ఆ డబ్బులు హెచ్ఎండీఏకు చెందినవి. ఒప్పందం ప్రకారం డబ్బులు పంపించాము… డబ్బులు ముట్టినవని అవతలి వ్యక్తి కూడా చెబుతున్నాడు… ఆ తర్వాత లైసెన్స్ ఫీజు వాపస్తు ఇస్తామని చెబుతున్నారు… ఇప్పుడు జరగాల్సిన ఈవెంట్ ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో అందరికీ తెలుసు.

 

వీళ్ల (రేవంత్ సర్కారు) చేతకానితనం వల్లే ఈవెంట్ రద్దయింది. వీళ్లకు స్పోర్ట్ అర్థం కాదు, కాన్సెప్ట్ తెలియదు కాబట్టి… వీళ్ల తెలివితక్కువతనం వల్ల రేసింగ్ ఈవెంట్ పోయింది. ఇలా చేస్తే మోటార్ స్పోర్ట్ లో మనల్ని ఎవరైనా నమ్ముతారా?

 

నిజంగా చెప్పాలంటే ఇవాళ కేసు ఎవరిమీద పెట్టాలి? రేవంత్ రెడ్డి మీదే కేసు పెట్టాలి. ఎందుకంటే… ఇంత అద్భుతమైన రేసును హైదరాబాదుకు కాకుండా, ఇండియాకే కాకుండా చేసినందుకు ఆయన మీదే కేసు పెట్టాలి” అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

కాగా, తనపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో, కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఆయన రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నారు.