తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసా అంశం హీటెక్కింది. కేటీఆర్-మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేళ్లలో తామే అంతా చేశామని చెప్పడంపై మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టుకు ఒక్క ఎకరాకు నిధులు ఇచ్చినట్టు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
శనివారం తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనిపై సాగు చేయని భూములకు గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి నిధులను దుర్వినియోగం చేసిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి సంక్రాంతికి విధివిధానాలు పూర్తి చేసి, నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. మంత్రుల ప్రకటనపై బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడారు.
పదేపదే హిస్టరీ గురించి చెప్పడంపై కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. చివరకు స్పీకర్ జోక్యంతో చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో పిలవడం సరికాదని కేటీఆర్‌కు సూచన చేశారు స్పీకర్. తానేమీ తిట్టలేదంటూ మళ్లీ కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత చర్చ మొదలైంది.
24 గంటల ఉచిత విద్యుత్ అందించామని పదేపదే కేటీఆర్ చెప్పడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. సభను తప్పదోవ పట్టించడం సరికాదన్నారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉచిత విద్యుత్ గురించి అమెరికాలో మాట్లాడడంపై రాద్దాంతం చేశారన్నారు. మరుసటి రోజు తాను ఓ రోజు సబ్‌స్టేషన్ కు వెళ్లి ఆపరేటర్ నుంచి వివరాలు సేకరించానన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రోజుకు 10 లేదా 11 గంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి. దీనికి సంబంధించిన రికార్డు ఉందన్నారు. 50 ఏళ్లలో నాగార్జున సాగర్, శ్రీశైలం, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
పదేళ్లలో నీళ్లు, నిధులు ఎక్కడంటూ ఎదురుదాడికి దిగారు. రేపో మాపో మేడిగడ్డ కూలిపోతుందని రిపోర్టు ఇచ్చారని, పదేళ్లలో మీరు ఏం చేశారని మండిపడ్డారు. సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఈలోగా కేటీఆర్ మాట్లాడుతూ సభను 10 రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు.