Mahaa Daily Exclusive

  ఈడీ దిగడంతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి..?

Share

ఫార్ములా ఈ-రేసు కేసు అనేక మలుపులు తిరుగుతోందా? న్యాయస్థానం ఆదేశాలతో ఊపిరి పీల్చుకున్న కేటీఆర్, ఈడీ నుంచి ముప్పు పొంచి వుందా? ఈడీ అరెస్టు చేస్తే ఆరు నెలలు వరకు బెయిల్ రావడం కష్టమా? కేటీఆర్‌ను తీహార్ జైలుకి పంపిస్తారా? ఇవే ప్రశ్నలు బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటాడుతున్నాయి. కేటీఆర్ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?

 

ఫార్ములా ఈ-రేసు కేసు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రేపో మాపో కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ. ఆయనతోపాటు అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్‌రెడ్డి నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ప్రశ్నాపత్రం రెడీ చేసినట్టు తెలుస్తోంది.

 

నిధులు విడుదలకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 46 కోట్ల రూపాయలు విదేశాల్లో ఏ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేశారు? డాలర్ల చెల్లింపుల్లో ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? విదేశీ కంపెనీతో ఒప్పందం జరిగితే ఆ ఫైలును గవర్నర్ వద్దకు ఎందుకు పంపలేదు? వంటి ప్రశ్నలు రెడీ చేసినట్టు అంతర్గత సమాచారం.

 

ఫార్ములా కేసులో అరెస్టు కాకుండా న్యాయస్థానం నుంచి స్వల్ప ఊరట పొందారు కేటీఆర్‌. తీర్పు వెల్లడైన కాసేపటికే ఈడీ కేసు నమోదు చేయడంతో కేటీఆర్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. శుక్రవారం ఉదయం వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది ఈడీ. సాయంత్రానికి కేసు నమోదు చేసింది.

 

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతా నుంచి యూకెలోని ఎఫ్ఈవో సంస్థకు ట్రాన్స్‌ఫర్ అయిన నిధులపై ఫోకస్ చేయనుంది. యూకె అధికారిక కరెన్సీ బ్రిటీష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన వాటిపై తీగ లాగనుంది. ప్రధానంగా ఫెమా, పీఎంఎల్ఏ చట్టాల ఉల్లంఘనపై ఆరా తీయనుంది. విదేశాలకు మళ్లించిన నిధులు చివరగా మరెవరి ఖాతాలోకైనా వెళ్లాయా? అనే అంశంపై కూపీ లాగనుంది ఈడీ.

 

మరోవైపు ఈడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు కేటీఆర్. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేయడంతో క్వాష్ పిటీషన్‌పై మళ్లీ వాదనలు జరిగే అవకాశముంది. ఎందుకంటే ఈడీ కూడా కేటీఆర్‌తోపాటు మరో ఇద్దరు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

క్వాష్ పిటిషన్ వేసి ఈడీ విచారణకు హాజలవ్వాలా లేదా అనే దానిపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో గతరాత్రి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అదే జరిగితే సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

 

ఎలాగ చూసినా కేటీఆర్ మెడకు ఈడీ ఉచ్చు బిగుసుకున్నట్లయ్యింది. ఈడీ కేసు నమోదు చేయడంతో ఐదారు నెలలు కేటీఆర్‌కు బెయిల్ రావడం కష్టమని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూడా కవితకు ఆరునెలలు వరకు బెయిల్ రాకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన ఆయన తీహార్ జైలుకి వెళ్లడం ఖాయమేనన్న వాదన లేకపోలేదు.