Mahaa Daily Exclusive

  జగన్ కు టెన్షన్..? కారణం అదేనా..?

Share

వచ్చే నెల నుంచి జిల్లాలకు జగన్ వెళ్తున్నారా? వాయిదా వేసుకునే పనిలో పడ్డారా? కీలక నేతలపై కేసులు నమోదు కావడంతో ఆలోచనలో పడ్డారా? ఓ వైపు అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్లడంతో ఏం చెయ్యాలో కన్ఫ్యూజన్‌లో పడ్డారా? సమావేశంలో జగన్ మాటలు విన్న కార్యకర్తల ఏమంటున్నారు? ఇంకా లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం.

 

సంక్రాంతి తర్వాత జిల్లాలకు శ్రీకారం చుట్టనున్నారు వైసీపీ అధినేత జగన్. దానిపై ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నేతలపై కేసులు నమోదు కావడంతో అడుగు వేసేందుకు ఒకటి రెండుసార్లు ఆలోచన చేస్తున్నారట. అయినా ముందస్తు ఎన్నికలు లేవని సంకేతాలతో మరో ఏడాది వెయిట్ చేయాలని భావిస్తున్నారట.

 

ఈలోగా వారానికి ఒకటి లేదా 15 రోజుల కొకసారి కూటమి పాలనను నిరసిస్తూ కార్యక్రమం చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 27న, వచ్చే నెల 3న ఇలా డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు వైసీపీ అధినేత. రోజుకో జిల్లా కార్యకర్తలతో సమావేశం పెడితే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారట జగన్.

 

తాడేపల్లి ప్యాలెస్‌లో జిల్లాల కార్యకర్తలతో మమేకం అవుతున్నారు జగన్. సమావేశంలో కొంతమంది కార్యకర్తలు చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి సలహాలు, సూచనలు ఏ మాత్రం తీసుకోలేదట. ఎంతసేపు గత వైసీపీ పాలన, స్కీమ్‌లు, సచివాలయాలు, వాలంటీర్లల గురించి తప్పితే మరో మాట లేదని అంటున్నారు.

 

విద్యా దీవెన, వసతి దీవెన నిధులు రాక పిల్లలు చదువులు మానేస్తున్నారని చెప్పుకొచ్చారు జగన్. వైసీపీ హాయాంలో ప్రతీ మూడు నెలలకు నిధులను తల్లుల అకౌంట్లో వేశామని, కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు త్రైమాసికాలు అయిపోయాయని చెప్పారట. కూటమి సర్కార్ వచ్చి కేవలం దాదాపు ఆరునెలలు కావస్తోంది. అప్పుడే నాలుగు త్రైమాసికాలు ఎలా అయ్యాయని కార్యకర్తలు చర్చించుకోవడం కొసమెరుపు.

 

జగన్ మాటలు విన్నవారు మాత్రం అధినేత కంగారు పడుతున్నారని అంటున్నారు. ఇదిలావుండగా వైసీపీ పాలనలో లోపాలను కూటమి సర్కార్ రోజుకొకటి తెరపైకి తీసుకురావడంపైనా జగన్ గమనిస్తున్నారు. ఎంతసేపు వైసీపీ పాలనను బద్నామ్ చేసే బదులు, పాలనపై దృష్టి పెడితే బాగుండేదని ఆయన మాట.

 

అలాగని కూటమి సర్కార్ ప్రజల్లోకి దూసుకెళ్లడాన్ని అధినేతతోపాటు ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. వైసీపీకి కీలక ఓటు బ్యాంకు రూరల్. దానిపై జనసేన ఫోకస్ చేయడంతో జగన్‌ కొంత టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పరువు దక్కించుకుందంటే కేవలం రూరల్ వల్లేనని అంటున్నారు.

 

శుక్రవారం జనసేన అధినేత పవన్ మన్యం జిల్లా టూర్ వేయడాన్ని ఆ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి ప్రజలతో మమేకం కావడమే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు సీఎం చంద్రబాబు.. అమరావతి, పోలవరం పనులపై దృష్టి సారించారు. కూటమి దూకుడు ఇలాగే కంటిన్యూ అయితే వైసీపీకి కష్టాలు తప్పవనే ప్రచారం అప్పుడే మొదలైపోయింది. ఈ సమస్యల నుంచి ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ఎలా గట్టెక్కుతారో చూడాలి.