Mahaa Daily Exclusive

  తిరుమలలో విరామం లేకుండా అన్న ప్రసాదం…!

Share

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శుక్రవారం నాడు 65,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,297 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

ఈ 10 రోజుల్లో ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది వరకు భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది. క్యూ లైన్లల్లో వేచివుండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేయడానికి అదనంగా శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బందిని అందుబాటులో ఉంచనుంది.

అశేష భక్తజనం కోసం తెల్లవారు జామున 6 నుండి రాత్రి 12 గంటల వరకు విరామం అనేది లేకుండా అన్న ప్రసాదాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నారు టీటీడీ అధికారులు. 6 గంటలకు ఆరంభం అయ్యే అన్నప్రసాదాల వితరణ అర్ధరాత్రి వరకూ కొనసాగించేలా వంటశాలలో అదనపు సిబ్బందిని నియమించనుంది.

భక్తులందరికీ అల్పాహారంగా ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి, ⁠టీ, కాఫీ, పాలు అందజేస్తారు. అలాగే- లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు. ప్రతిరోజూ 3.50 లక్షల లడ్డూలను అదనంగా తయారు చేసేలా ప్రణాళికలను రూపొందించుకున్నారు. దీనితోపాటు అదనంగా మూడున్నర లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా సిద్ధం చేసుకోనున్నారు.