ఆదిలాబాద్ కోటాలో పరిశీలిస్తున్న అధిష్టానం
మార్చిలో ఖాళీకానున్న ఐదు స్థానాలు
కాంగ్రెస్ కు 4, బిఆర్ఎస్ కు ఒకటి దక్కే అవకాశం
పోటీపడుతున్న 20మందికి పైగా నేతలు
ఎమ్మెల్సీ ఆశిస్తున్న హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ నేతలు
అధిష్టానం పరిశీలనలో అద్దంకి, కంది, జగ్గారెడ్డి, సామా, చరణ్ , హరివర్ధన్ తదితరులు
హైదరాబాద్, మహా
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ రేసు మొదలైంది. మార్చిలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానుండగా, అధిష్టానం వీటిభర్తీపై దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ రూపాల్లో నివేదికలు తెప్పించుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇప్పటినుండే వ్యూహరచన ప్రారంభించింది. పార్టీ నాయకత్వం బలహీనంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్, ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాలకు మంత్రులు లేకపోగా.. ఇటీవల నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు గరిష్టంగా పదవులు దక్కడంతో పాటు అదే జిల్లాకు పిసిసి చీఫ్ పదవి దక్కింది. దీంతో ఇపుడు ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారాయి. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. భవిష్యత్తుపై వ్యూహరచనతో పదవులు కట్టబెట్టే అవకాశముంది. గతంలో వచ్చినట్లే వచ్చి చేజారిన ఎమ్మెల్సీ ఈ దఫా అద్దంకి దయాకర్ కు ఖాయమన్న చర్చ ఉంది. ఆదిలాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జి, అమ్మన్యూస్ నెట్ వర్క్ మీడియా సంస్థల అధిపతి కంది శ్రీనివాసరెడ్డికి ఇచ్చే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ అవసరాలు, వ్యూహాల రీత్యా ఎమ్మెల్సీ దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. అద్దంకి దయాకర్, కంది శ్రీనివాసరెడ్డిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీరవిధేయులుగా పేరుంది. మరోవైపు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టిపిసిసి మీడియా సెల్ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీని ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుండి టిపిసిసి ప్రచారకమిటీ కన్వీనర్ మధుయాష్కీ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్ , మహబూబ్ నగర్ నుండి జగదీశ్వర్ రావు తదితరులు ఆశిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఆశావహులు ఉన్నా, వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ బాధ్యత భుజాన వేసుకోవడం, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అసెంబ్లీకి పార్టీని సన్నద్దం చేసే ముందుచూపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయాలు తీసుకోనున్నారు. సంక్రాంతి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, ఈలోగా అధిష్టానం అంచనాకు వచ్చే వీలుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఫైనల్ చేసింది.
త్వరలో విస్తరణ
ప్రస్తుతం కేబినెట్ లో ఆరు ఖాళీలుండగా, మంత్రివర్గ విస్తరణపై కపరత్తు జరుగుతోంది. హైదరాబాద్ లో బిఆర్ఎస్ నుండి చేరిన నేతలకు పదవులు దక్కుతాయా.. కాంగ్రెస్ నేతలకు దక్కుతాయా అన్నది చూడాల్సి ఉంది. మరికొందరు ఎమ్మెల్యే కారుదిగి చేయందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం ఉంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ల మధ్య గట్టిపోటీ నెలకొంది. వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి దక్కుతుందో చూడాలి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆశిస్తున్నారు. ఎస్టీ లంబాడా కోటాలో బాలునాయక్, రామచంద్రనాయక్ పోటీపడుతున్నారు. త్వరలో నాలుగు బెర్త్ లు భర్తీచేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.