Mahaa Daily Exclusive

  అల్లు అర్జున్‌కు బండి సంజయ్ మద్దతు…!

Share

అల్లు అర్జున్‌కు బండి సంజయ్ మద్దతు

తెలుగు సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ పగ బట్టినట్లుంది

అసెంబ్లీలో కథ అల్లి మసీఎం మాట్లాడారు

ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ

హైదరాబాద్, మహా : సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండగా నిలిచారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఱెడ్డ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమపై బట్టినట్లుగా ఉన్నాయని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని, శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంతో పాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచినట్లు వెల్లడించారు. సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవల్‌లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించటం సిగ్గు చేటని సంజయ్ విరుచుకుపడ్డారు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని ఫైరయ్యారు. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అని సంజయ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందన్నారు. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని హెచ్చరించారు. గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా? అని నిలదీశారు. మీకో న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని హితవు పలికారు. లేనిపక్షంలో బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. కోండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సీఎం సోదరుడి పేరు రాసి ఆత్మహత్య చేసుకున్నారని, ఆ ఘటనపై చట్టం నిక్కచ్చిగా పని చేసిందా సీఎం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కావాలని కాంగ్రెస్ పార్టీ తెలుగు సినీ రంగాన్ని వేధింపులకు గురి చేస్తుందని సంజయ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సినీ రంగంపై దాడులు పెరిగాయని సంజయ్ గుర్తు చేశారు.